ఉద్యోగం ఆఫర్లను నమ్మవచ్చా?

సంస్థ గురించి పరిశోధన అవసరం

కావ్య బిటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. వచ్చే ఏడాది ప్రాంగణ నియామకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాగూ ఇంటర్న్‌షిప్‌ పూర్తయింది. భవిష్యత్తులో ఉపయోగపడేలా పార్ట్‌టైం ఉద్యోగం ద్వారా ఉద్యోగానుభవం పొందాలనుకుంది.

అందులో భాగంగా జాజ్‌ సైట్లలో వివరాలతో నమోదు చేసుకుంది. నెలకు కనీసం రూ.10,000-రూ.15,000 వరకూ లభించే ఉద్యోగాలు వస్తాయనుకుంది. ఊహించని రీతిలో ఎన్నో ఉద్యోగావకాశాలతో తన ఇన్‌బాక్స్‌ నిండిపోయింది. పెద్దపెద్ద సంస్థల నుంచీ ఇంటర్వ్యూకు పిలుపొచ్చింది. శామ్‌సంగ్‌, ఎల్‌ఐసి, డెల్‌, గూగుల్‌ వంటి సంస్థలు పెద్ద మొత్తంలో జీతభత్యాలను అందిస్తున్నాయి.

ఆసక్తి ఉంటే కాల్‌ చేయమని కింద ఇచ్చిన నంబరుకి కాల్‌ చేసింది. ఫోన్‌లోనే ఇంటర్వ్యూ అయిపోయింది. దరఖాస్తు ప్రక్రియకూ, కాల్‌లెటర్‌ మొదలైన అవసరమైన పత్రాలను పంపడానికీ కొంత మొత్తం చెల్లించమన్నారు. వచ్చే జీతంతో పోలిస్తే పంపేది పెద్ద మొత్తంగా అనిపించలేదు. వెంటనే చెప్పిన అకౌంట్‌లో జమ చేసింది. అలా ఇంకొన్న కారణాలతో మళ్లీమళ్లీ అడిగినా జమ చేసింది. తీరా వారం, పది రోజులు గడిచినా ఎలాంటి సమాచారమూ అందలేదు.

తనకు ఇచ్చిన నంబరుకు కాల్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చింది. ఆపై ఎన్నిసార్లు చేసినా అదే సమాధానం. రానురానూ పెరిగిపోతున్న ఉద్యోగపోటీ, ఒక ఉద్యోగానికి వందలు, వేల సంఖ్యలో పోటీదార్లు. దీంతో ఉద్యోగాల అన్వేషణ కష్టమవుతుతోంది.

అందుకే చాలామంది అభ్యర్థులు మొదటి ప్రయత్నంగా ఉద్యోగ సంబంధిత వెబ్‌సైట్‌లలో తమ రెజ్యూమెలను నమోదు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇలాంటి తరుణంలో మీ రెజ్యూమెను చూశాం. దానిని మీరు రాసిన విధానం మీ నాయకత్వ లక్షణాలను చూపిస్తోంది.

మా సంస్థకు అవసరమైన లక్షణాలు మీలో మాకు స్పష్టంగా కనిపించాయి. మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం ఎంపిక చేశాం. అంటూ ఫోన్‌కాల్‌ వస్తే ఎవరైనా ఎరిగి గంతేస్తారు. ఆ సంతోషాతిశయంలో సందేహాలేమీ తట్టవు. పైగా ఫోన్‌ చేసింది. పెద్ద పేరున్న సంస్థలయినప్పుడు సులువుగా నమ్మకుండా ఉండలేరు.

ఉద్యోగాన్వేషణ చేసే అభ్యర్థులు కొద్దిగా సంస్థ గురించి పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఇందుకు లింక్‌డిన్‌, ఫేక్‌బుక్‌, సంబంధిత సంస్థ వెబ్‌సైట్‌ సాయపడతాయి. అభ్యర్థులు తాము సరిగా గుర్తించలేకపోతున్నామనిపిస్తే సంస్థ వెబ్‌సైట్‌లో ఇచ్చిన నంబరుకు ఫోన్‌ చేసి, ఈ-మెయిల్‌/ కాల్‌ వచ్చిన వ్యక్తి అక్కడ పనిచేస్తున్నారో లేదో కనుక్కున్నా ఆఫర్‌ విశ్వసనీయత తెలిసిపోతుంది.

ఫేక్‌జాబ్‌ యాడ్స్‌ ఇచ్చేవారు సంస్థల పేర్లు, ఈ-మెయిల్‌ చిరునామాలను కొద్దిపాటి తేడాతో రూపొందించుకుంటుంటారు. అభ్యరుథలను ఇవే తప్పుదోవ పట్టిస్తుంటాయి. అసలైన సంస్థ నుంచే వచ్చిందని నమ్మి, మోసపోతుంటారు.

నియామక ప్రక్రియలో డబ్బులు అడిగారంటేనే దానిని ఫేక్‌ ఉద్యోగంగా గుర్తించాలి. చాలామంది అభ్యర్థులు అనుభవం కోసం చిన్న సంస్థల్లో తక్కువ ఉద్యోగానికి చేరుతుంటారు. కొంత అనుభవం సంపాదించాక పెద్ద సంస్థలకు మారుతుంటారు. ఇది ఆ సంస్థలకు నష్టం. కాబట్టి, అలాంటి సంస్థలు అభ్యర్థిని తమతో కొన్ని ఏళ్లపాటు అట్టిపెట్టుకోవడానికి గ్యారెంటీ అడగొచ్చు.

అయితే వీరైనా నేరుగా డబ్బులు కట్టమని అడగరు. అదైనా డిడి, చెక్‌ రూపంలో తీసుకుంటారు. ఫోన్‌లోనే ఇంటర్వ్యూ ప్రక్రియను ఏ సంస్థా ముగించదు.

కొన్నిసార్లు సంస్థలు తమకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు అవసరం అయినప్పుడు కన్సల్టెన్సీల సాయం తీసుకుంటాయి. వారు సంస్థ తరపున ఫోన్‌లో ప్రాథమికంగా ఎంపిక చేస్తారే తప్ప నేరుగా ఉద్యోగానికి ఎంపిక చేయరు.

తాజా ‘నిఘా’ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/investigation/