డిఎల్‌,జెఎల్‌ పోస్టులు భర్తీ చేయండి

Joshi S.K
Joshi S.K

హైదరాబాద్‌: గత ఏడేనిమిది ఏళ్లుగా గ్రూపు-1, 3,4 సర్వీస్‌ ఉద్యోగాలకు, ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయడం లేదని, ఈ ఉద్యోగాల గురించి రాష్ట్రంలో 8 లక్షల మంది ప్రిపేర్‌ అవుతూ నోటిఫికేషన్‌ గురించి ఎదురుచూస్తున్నారనీ చీఫ్‌ సెక్రెటరీకి బిసి నేతలు తెలిపారు. బుధవారం సచివాలయంలో టిడిపి ఎమ్మెల్యే, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య నేతృత్వంలోని సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ఆయా సంఘాల నేతలు నీల వెంకటేష్‌, నిరుద్యోగ జాక్‌ ఛైర్మన్‌ జి. రమేష్‌, కె. నర్సింహాగౌడ్‌, గజేందర్‌, మహేందర్‌యాదవ్‌లతో కూడిన ప్రతినిధి బృందం ఈమేరకు సిఎస్‌ను కలిపి వినతిపత్రం అందజేశారు. ఈసందర్బంగా వారు ఆయనతో మాట్లాడుతూ గ్రూపు-1 కింద 18 సర్వీసుల్లో 1200 ఉద్యోగా ఖాళీలున్నట్లు అధికారులు చెబుతున్నారని, వీటికి వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయాలని కోరారు. గ్రూపు 3 సర్వీస్‌లో 8 వేల ఖాళీలున్నాయని ప్రత్యేకంగా సెక్రటేరియట్‌, ప్రభుత్వ డైరెక్టరేట్‌ల్లో పెద్దఎత్తున ఈ ఖాళీలు ఉన్నాయని తెలిపారు. గ్రూపు-4 సర్వీస్‌ కింద 34 వేల జూనియర్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ ఇలాంటి కీలకమైన పోస్టులను టిఎస్‌పిఎస్సీ ద్వారా భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం బలహీనపడిందన్నారు. ప్రస్తుతం జారీ చేసిన గ్రూపు-2 పోస్టుల ప్రక్రియ వెంటనే పూర్తి చేసిన మళ్లీ కొత్తగా 3 వేల పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని సిఎస్‌కు వారు విజ్ఞప్తి చేశారు.
అలాగే 4500 జూనియర్‌, 1500, డిగ్రీ లెక్చరర్‌, వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 2200 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని కోరారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో దాదాపు 4500 టీచర్‌ పోస్టులు గత 18 ఏళ్లుగా భర్తీ చేయకపోవడంతో వాటిల్లో విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయన్నారు. ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో కూడా 2500 లెక్చరర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది డిగ్రీ, పిజి ఇంజనీరింగ్‌ తదితర వృత్తివిద్యా కోర్సులు చదివిన నిరుద్యోగులు ఈగ్రూపు, ఇతర ఉద్యోగాలకై వేచి ఉన్నారని, తమరు జోక్యం చేసుకుని సంబంధిత శాఖాధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలని సిఎస్‌కు ఆయా బిసి సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.