ఉద్యోగాల నియామ‌కంలో భారీ దోపిడీ

ayyanna patrudu
ayyanna patrudu

విశాఖ‌ప‌ట్ట‌ణంః ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకాల్లో భారీ దోపిడీ జరుగుతున్నదని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కాంట్రాక్టర్‌ 20-30 మందిని ఉద్యోగాల్లోకి తీసుకుని, వారి వద్ద నుంచి లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసిందన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించే జీతాల సొమ్ము నుంచి ఐదు శాతం కమీషన్‌గా తీసుకోవడమే కాకుండా, పోస్టులను అడ్డగోలుగా అమ్ముకుంటూ నిరుపేద నిరుద్యోగులను దోచుకుంటున్నారని విమర్శించారు. విద్యుత్‌ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగానికే ఐదు లక్షలు వసూలు చేస్తున్నారంటే ఏస్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో అర్థం అవుతుందన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలకు లంచం కోసం ఉన్న ఎకరా, అర ఎకరం అమ్ముకుంటున్నారని, ఐదేళ్ల తరువాత రోడ్డున పడుతున్నారన్నారు. విశాఖలోనే కాకుండా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల కోసం కాంట్రాక్టర్లు ఎవరైనా డబ్బులు అడిగితే తనకు తెలియజేయాలని, సదరు కాంట్రాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకుంటానన్నారు.