ఇక‌పై అన్ని ప్ర‌వేశ ప‌రీక్ష‌లు ఆన్ లైన్‌లోనే!

online recrutiment
online

హైద‌రాబాద్ః రాష్ట్రంలో నిర్వ‌హించే ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్ వంటి అన్నిరకాల ప్రవేశపరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద‌ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించిన పనులను కూడా మొదలుపెట్టారు. ప్రయోగాత్మకంగా 2017-18 విద్యాసంవత్సరంలో ఎంటెక్, ఎంఫార్మసీ కోసం నిర్వహించిన పీజీఈసెట్-2017ను ఆన్‌లైన్‌లోనే నిర్వహించి విజయం సాధించారు. అదేవిధంగా జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈసెట్-2017ను కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించారు. ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణకు సహకారం అందించనున్న టీసీఐ ప్రతినిధులతో ఇప్పటికే సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం (2018) ఎంసెట్ నిర్వహణ బాధ్యతలను కూడా జేఎన్టీయూహెచ్‌కే అప్పగించామని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఎంసెట్‌తో పాటు అన్నిరకాల ప్రవేశపరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించే క్రమంలో ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఆమేరకు అవగాహన కల్పించాల్సి ఉందని, ఈ విధానం వల్ల ప్రవేశపరీక్షల ఫీజులు స్వల్పంగా పెరిగే అవకాశముందని ఆయన స్ప‌ష్టం చేశారు.