దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి ఒమిక్రాన్ సోకిందా..?

ఒమిక్రాన్‌ ఈ పేరు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా వినిపిస్తుంది. కరోనా ముప్పు నుండి ఇంకా ప్రజలు బయటపడకముందే..ఈ మహమ్మారి ఇప్పుడు అన్ని దేశాల ప్రజలను వణికిస్తోంది. సౌత్ ఆఫ్రికా లో ఈ కొత్త ఒమిక్రాన్‌ వేరియంట్ బయటకువచ్చింది. ఇప్పటికే పలు దేశాలతో పాటు మనదేశంలోనూ ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇప్పుడు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసాకు కరోనా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలతో ఉన్న ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణాఫ్రికాలో తొలిసారిగా వెలుగు చూసిన కరోనా నూతన వేరియంట్‌ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నవేళ స్వయంగా ఆ దేశాధ్యక్షుడికి కరోనా సోకడంతో ఇది ఒమిక్రాన్ నేనా అని అనుమానిస్తున్నారు.

రామఫోసో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నారు. అయితే ఆదివారం ఆయన స్వల్ప అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు నిర్వహించామని, అందులో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కేప్​టౌన్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారని, వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పుకొచ్చారు. దక్షిణాఫ్రికాలో నిన్న ఒక్కరోజే 17,154 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 7861 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి.