మందుబాబులకు ఝలక్.. మద్యనిషేధం విధించిన ప్రభుత్వం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుండి ఇంకా పూర్తిగా సురక్షితం కాకపోవడంతో యావత్ ప్రపంచ దేశాలు కరోనా నివారణ కోసం పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా దేశంలో తాజాగా మరోసారి కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఆదేశాలు జారీ చేశాడు. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో కరోనా విలయతాండవం చేస్తుందని, అందుకే ప్రజల ప్రాణాలను కాపాడేందుకే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు 10 లక్షలు దాటడంతో, కరోనా నివారణకు ఐదు అంచెల వ్యూహాన్ని అక్కడి ప్రభుత్వం సిద్ధం చేసింది. అంతేగాక కరోనా కొత్త వైరస్ వ్యాప్తి కూడా దేశంలో ఎక్కువగా ఉందని, ముఖ్యంగా యువతలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తుందని అధికారులు అంటున్నారు. అటు న్యూ ఇయర్ వేడుకల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు తెలిపాడు. ఇందలో భాగంగా దేశవ్యాప్తంగా మద్య నిషేధం విధిస్తున్నట్లు అధ్యక్షుడు సిరిల్ తెలిపారు. ఎవరైనా మద్యం అమ్మితే కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.

అంతేగాక మాస్క్ ధరించకపోవడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తామంటూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షిస్తామని దక్షిణాఫ్రికా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా మనుష్యుల ప్రాణాలు కాపాడటమే తమకు ముఖ్యమని, అందుకోసమే ఈ కఠిన నిబంధనలు విధిస్తున్నామని వారు అంటున్నారు. మొత్తానికి కరోనా స్ట్రెయిన్ కారణంగా ఇప్పటికే పలు దేశాల్లో మరింత కఠిన నిబంధనలు అమలు పరుస్తుండటంతో మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి.