అది గంగూలీకే సాధ్యం

పాకిస్థాన్‌ క్రికెటర్‌ రషీద్‌ లతీఫ్‌ సంచలన వ్యాఖ్యలు

Rashid Latif & Sourav Ganguly
Rashid Latif & Sourav Ganguly

న్యూఢిల్లీ: భారత్‌-పాక్‌ దేశాల మధ్య క్రికెట్‌ సంబంధాలు బలపడడానికి బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చొరవ చూపాలని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌ వ్యాఖ్యానించాడు. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగనంత వరకు సంబంధాలు మెరుగవ్వవని ఆయన చెప్పాడు. 2004లో భారత జట్టు పాకిస్థాన్‌ పర్యటనకు సంబంధించి అప్పటి కెప్టెన్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ బీసీసీఐని ఒప్పించడంలో కీలకపాత్ర పోషించాడని రషీద్‌ లతీఫ్‌ పేర్కొన్నాడు. ఒక క్రికెటర్‌గా, బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ ఇప్పుడు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పిసిబి)తో పాటు ఇషాన్ మణికి సాయం చేయగలడని ఆయన పేర్కొన్నాడు. పిసిబి సీఈఓ వసీంఖాన్‌ సైతం పెద్ద జట్లను పాక్‌లో పర్యటించడానికి తన వంతు కృషి చేయాలని అన్నాడు. దీని ద్వారా స్థానిక ఆటగాళ్లకు, పాకిస్థాన్‌ క్రికెట్‌కు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పాడు. 2004లో బిసిసిఐ పాకిస్థాన్ పర్యటనకు విముఖత చూపినప్పుడు గంగూలీ
బిసిసిఐతో పాటు ఆటగాళ్లను ఒప్పించాడని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. చాలా కాలం తర్వాత ఇక్కడ పెద్ద విజయాన్ని సాధించడంతో ఆ పర్యటన భారతదేశానికి చాలా గుర్తుండిపోయే పర్యటనగా మిగిలిపోయిందని అన్నాడు. కాగా, ఇటీవలే శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటించి సంగతి తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/