ఉక్రెయిన్ లో భార‌తీయ బాధితుల‌కు ‘సోనూసూద్’ సాయం

ఖర్కీవ్ నుంచి పోలండ్ సరిహద్దుకు తరలింపు

ముంబయి: ప్రముఖ నటుడు సోనూసూద్ బాధితులకు, నిర్భాగ్యులకు సాయం అందించడంలో ముందుంటాడు. అడిగితే చాలు.. కాదనలేని మనసున్న మనిషి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో.. ఉక్రెయిన్ లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర సర్కారు ఒకవైపు ముమ్ముర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినా కొందరు బాధితులు సోనూసూద్ ను స్మరించుకుంటున్నారు. సాయం కోసం సామాజిక మాధ్యమాల సాయంతో ఆయనకు వినతులు పంపుతూనే ఉన్నారు.

సోనూసూద్ కు చెందిన చారిటీ సంస్థ నుంచి తమకు సాయం అందడం పట్ల అక్కడి భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. సహాయక కార్యక్రమాలకు సంబంధించి సోనూసూద్ కూడా తన ట్విట్టర్ పేజీలో తాజా వివరాలను ఉంచుతున్నారు. ‘‘ఇది నా బాధ్యత. నా వంతుగా సాయం చేయగలిగినందుకు సంతోషిస్తున్నాను’’ అంటూ సోనూ స్పందించాడు.

కరోనా మహమ్మారి నియంత్రణ సమయంలో లాక్ డౌన్ లు విధించిన సమయంలోనూ బాధితులు స్వస్థలాలకు చేరేందుకు సోనూసూద్ సాయపడడం తెలిసిందే. ఉక్రెయిన్ లోని ఖర్కీవ్ పట్టణంలో చిక్కుకుపోయిన భారతీయులను అక్కడి నుంచి తరలించడంలో సోనూసూద్ కు చెందిన చారిటీ సంస్థ సేవలు అందిస్తోంది. అక్కడి నుంచి పోలండ్ సరిహద్దుకు తరలిస్తోంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/