మొదటి రోజు సోనియాఫై ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ..

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో నేడు సోనియా గాంధీ ఈడీ ముందు హాజరయ్యారు. దాదాపు రెండు గంటలపాటు ఈడీ అధికారులు సోనియాఫై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ రెండు గంటలోనే 20 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. ఆరోగ్య కారణాలతో ఆమె చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని పరిగణించిన ఈడీ అధికారులు.. తొలిరోజు విచారణను త్వరగానే ముగించారు. మధ్యాహ్నం రెండున్నరకు ఆమె ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు. మళ్లీ సోమవారం విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు.

రాహుల్ గాంధీని విచారించిన ఐదు రోజుల్లో అడిగిన ప్రశ్నలనే సోనియా గాంధీని కూడా అడగవచ్చని ED వర్గాలు తెలిపాయి. యంగ్ ఇండియా (వైఐ), అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (ఏజేఎల్) మధ్య జరిగిన డీల్‌లో ఆమె పాత్ర గురించి ఈడీ సోనియా గాంధీని ప్రశ్నిస్తుంది. ఇదిలా ఉండగా సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించడంపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. కాగా బెంగళూరులో ఈడీ కార్యాలయం ముందు జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ సందర్భంగా ఆందోళనకారులు కారుకు నిప్పు పెట్టారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కార్యకర్తలపై వాటర్ కెనన్‌లు ప్రయోగించారు. అలాగే 75 మంది ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు.

సోనియా గాంధీకి కాంగ్రెస్​ శ్రేణులతో పాటు ఇతర పార్టీలు కూడా మద్దతుగా నిలిచాయి. డీఎంకే, శివసేన, ఆర్​జేడీ, సీపీఐ, సీపీఎం సహా మొత్తం 13 పార్టీలకు చెందిన నేతలు సోనియాకు మద్దతు పలికారు. పార్లమెంటు ఆవరణలో భేటీ అయ్యి ప్రకటన విడుదల చేశారు. అధికార దుర్వినియోగం ద్వారా రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులపై కేంద్రం నిరంతరం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని నేతలు పేర్కొన్నారు. ప్రతిపక్షాల్లోని కీలక నేతలే లక్ష్యంగా కేంద్రం ఈ దుశ్చర్యకు పాల్పడుతోందని ఆరోపించారు.