సోనియాకు అంత పుత్రవాత్సల్యమేల?

నెహ్రూ-గాంధీ కుటుంబ చరిత్ర ఆసక్తికరం

Priyanka Vadhera

నెహ్రూ-గాంధీ కుటుంబం చరిత్ర ఆసక్తికరమైనది! మనకు తెలిసినంతవరకు ఈ కుటుంబానికి మూలపురుషుడు- పండిట్‌ మోతీలాల్‌ నెహ్రూ కాశ్మీర్‌ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి అలహాబాద్‌ వచ్చి స్థిరపడిన ఈ కుటుంబం చరిత్ర త్యాగభరితమైనది. ఆసక్తికరమైనది.

పండిట్‌ మోతీలాల్‌ నెహ్రూ మాతృగర్భంలో వ్ఞండగానే తండ్రిని కోల్పోయాడు. అయినా, ఆయన లాయరై, రెండు చేతులా సంపాదించాడు. ఆ కుటుంబానిది భోగవిలాస జీవితం. వారి వస్త్రాలు ఆ రోజులలోనే విమానంలో పారిస్‌ వెళ్లి, అక్కడ చలువ చేయబడి వచ్చేవని ప్రతీతి.
అలహాబాద్‌లో ఆ కుటుంబం నివసించే ‘ఆనంద భవనం రమ్యహర్మ్యం! దేశ దేశాల వారు ఆ మనోహర భవనాన్ని వీక్షించడానికి వచ్చేవారు.

ఆనంద భవన్‌ స్వరాజ్యభవన్‌

ఆ భవనాన్ని మోతీలాల్‌ నెహ్రూ స్వాతంత్య్రోద్యమంలో చేరిన తరువాత అఖిలభారత కాంగ్రెసు కార్యాలయానికి ఇచ్చేచేశారు! తాము మరో ‘ఆనంద భవనాన్ని నిర్మించుకున్నారు.
ఎ.ఐ.సి.సి కార్యాలయానికి ‘స్వరాజ్‌ భవన్‌ అని పేరు పెట్టారు.

మోతీలాల్‌ రెండుసార్లు కాంగ్రెసుకు అధ్యక్షులైనారు. ఆయన తరువాత ఆయన ఏకైక కుమారుడు జవహార్‌లాల్‌ నెహ్రూ ఆధ్వర్యం ప్రారంభమైనది. ఆయన హయాంలోనే ఆ కుటుంబం స్వాతంత్య్రోద్యమంలో దాదాపు తమ సర్వస్వం కోల్పోయింది! జయిళ్ల పాలయింది. ఆయన మూడు, నాలుగు సార్లు కాంగ్రెసు అధ్యక్ష పదవిని నిర్వహించారు.

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో ఆయనే ప్రధాని పదవి అలంకరించారు. నెహ్రూ నా రాజకీయ వారసుడని జాతిపిత మహాత్మాగాంధీ చాలా ముందుగా ప్రకటించారు. ఆ పదవిలో నెహ్రూ 18 సంవత్సరాలుండి ఉపప్రధాని సర్దార్‌ పటేల్‌ తోడ్పాటుతో తీర్చిదిద్దారు. దశాబ్దాల పాటు బానిసత్వంలో మగ్గిన దేశానికి నూతన రూపురేఖలు దిద్దారు.

ఇందిరాగాంధీ హయాంలో

ఆయన తరువాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ తండ్రికీ, ఆమె కూ పోలికే లేదు. తండ్రి ఆదర్శవాది అయితే, ఆమె వాస్తవిక వాది. తండ్రి రూపురేఖలు దిద్దిన దేశానికి ఆమె మరిన్ని మార్పులు చేశారు. ఆమె తన అంగరక్షకులైన సిక్కుల చేతిలో హత్యచేయబడ్డం వల్ల ఆమె తరువాత ఆమె కుమారుడు రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవి స్వీకరించారు. ఆయన చాలా సౌమ్యుడు. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే ఆయన’బోఫోర్స్‌ కుంభకోణంలో చిక్కుకున్నారు. ఆయనను ఎల్‌.టి.టి.టి హంతకులు హతమార్చారు. ఆయన తరువాత పి.వి. నరసింహారావ్ఞ, సీతారామ్‌ కేసరి కాంగ్రెస్‌కు ఆధ్వర్యం వహించారు. పి.వి. దేశానికి నూతన ఆర్థిక విధానాన్ని రూపొందించారు.

ఆయన హయాంలోనే రాజీవ్‌ గాంధీ సతీమణి సోనియాగాంధీ -భర్త మరణానంతరం ఏడు సంవత్సరాల తరువాత కాంగ్రెసు అధ్యక్షురాలైనారు. ఆమె కాంగ్రెసు అధ్యక్ష పదవీ కాలంలోనే ఆ సంస్థ 2004 నుంచి 2014 వరకు అవిచ్ఛిన్నంగా డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా దేశాన్ని ఏలింది.

అయితే, ఆమెకు ‘కేన్సర్‌ వ్యాధి రావడంతో కాంగ్రెసు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అక్కడి నుంచి కాంగ్రెసుకు తిరిగి చెడు రోజులు ప్రారంభమైనాయి. ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ కాంగ్రెసు అధ్యక్ష పదవిని స్వీకరించినా, ఆయన నాయనమ్మ ఇందిరా, తల్లి సోనియా అంత సమర్థుడు కాడు!

అప్పుడే ప్రియాంక వస్తే…

నిజానికి, రాజీవ్‌గాంధీ హత్య జరిగినప్పుడే ఆయన కుమార్తె ప్రియాంక పోకడలు, ఆ సమయంలో దేశ విదేశాల నుంచి వచ్చే నాయకులను స్వాగతించే తీరు, తండ్రి చితివద్ద ఆమె వ్యవహరించే సరళిచూసి- ఆమె రాజీవ్‌కు తగిన వారసురాలని అందరూ అనుకున్నారు.

మాతృమూర్తే వ్యతిరేకం

అయితే, ప్రియాంక కాంగ్రెసు అధ్యక్షురాలు కావడానికి ఒకే వ్యక్తి వ్యతిరేకం. ఆమె తల్లి సోనియా గాంధీ! ప్రియాంక తనకు (సోనియాకు) ఇష్టంలేని రాబర్ట్‌ వాధ్రాను వివాహం చేసుకున్నదట! పేరు చివర ‘గాంధీ వ్ఞంటేనే ఓట్లు పడతాయట! మరి, ప్రియాంక’వాధ్రాకు ఓట్లు ఎలా పడతాయి?

కాగా, రాహుల్‌’గాంధీకి ఓట్లు పడతాయట! అదీ సోనియా ‘లాజిక్‌! కాని, రాహుల్‌ గాంధీకి ఓట్లు ఎక్కడ పడ్డాయి? ఆయన ఎక్కడ పాదం పెడితే, అక్కడ కాంగ్రెసు ఓడిపోయింది! ఇప్పుడాయన కాంగ్రెసు అధ్యక్షుడుగా వ్ఞన్నా అది ‘బలవంతపు బ్రాహ్మణార్థమే!

అందువల్ల కాంగ్రెసు అధ్యక్ష పదవిని ప్రియాంకకు వెంటనే అప్పగించితేనే కాంగ్రెసు సంస్థకు ఓట్లు అయినా సీట్లు అయినా!

-డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు,(”పద్మశ్రీ అవార్డు గ్రహీత)

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/