జగన్ కు బిజెపి , టీడీపీ నేతల వరుస లేఖలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి తెలుగుదేశం నేత నారా లోకేష్ తో పాటు , బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు బహిరంగ లేఖలు రాశారు. ఏక గ్రీవ పంచాయతీలకు ఇస్తానన్న ప్రొత్సహాకాలను ఎందుకివ్వడం లేదని ..పంచాయతీ నిధులకు పారదర్శకత ఏది..? ఏకగ్రీవ పంచాయతీ పాలక మండళ్ళకు ప్రోత్సాహక నగదు ఏది..? అంటూ సోము జగన్ కు లేఖ రాస్తే…లోకేష్ మాత్రం ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేతికొచ్చిన పంట నేలపాలై రైతులు పడుతున్న ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా పండించే వరి పంటకు పెద్ద ఎత్తున నష్టం ఏర్పడిందని… అప్పులు చేసి పెట్టుబ‌డులు పెట్టి, ఇంటిల్లిపాదీ శ్రమించి పండించిన‌ పంట చేతికందే సమయంలో వర్షాలకు నీటిపాలై తీవ్ర ఆందోళనలో ఉన్నారని..వారిని ఆదుకోవాలని లోకేష్ లేఖ లో పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుకు వరికి హెక్టారుకు రూ.25 వేలు, చెరకు రూ.30 వేలు, పత్తికి రూ.25 వేలు, జొన్నకు రూ.15 వేలు, కొబ్బరి చెట్టుకు రూ.3 వేలు, ఆక్వాకు హెక్టారుకు రూ.50 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేసారు.