మణికొండలో ఘోరం : మ్యాన్ హోల్లో పడి గల్లంతైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ డెడ్ బాడీ లభ్యం

రెండు రోజుల కింద మ్యాన్ హోల్లో పడి గల్లంతైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ డెడ్ బాడీ లభ్యమైంది. మణికొండలో నివాసముండే గోపిశెట్టి రజనీకాంత్ (42) షాద్‌నగర్‌లోని నోవా గ్రీన్ కంపెనీలో ఆయన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన రజనీకాంత్ తన ఇంటికి 50 మీటర్ల దూరంలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు రక్షించేలోగానే రజనీకాంత్ డ్రైనేజీలో కొట్టుకుపోయారు.
దీంతో వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం తో.. రజనీకాంత్‌ను వెతికేందుకు రెండు డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పడ్డాయి. సోమవారం ఇంజనీర్ మృతదేహం లభ్యమైంది. సోమవారం మధ్యాహ్నం నేక్నమ్ పూర్ చెరువులో డెడ్ బాడీ దొరికిందని పోలీసులు తెలిపారు. రజనీకాంత్ కోసం రెండ్రోజులుగా 60 మంది సిబ్బంది గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆయన మృతదేహాన్ని వెలికితీయడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.