సామాజిక దూరం కచ్చితంగా పాటించాలి

తెలంగాణ సీఎం కెసిఆర్

TS CM Kcr with Media

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో 59 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని ఒక్క రోజే పది మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలంగాణ సీఎం కెసిఆర్ అన్నారు.

శుక్రవారం సాయంత్రం అయన మీడియాతో మాట్లాడారు. సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.

ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే సామాజిక దూరం పాటించడం తప్పని సరి అని కేసీఆర్ అన్నారు. లాక్ డౌన్ చేయడం వల్ల కొంత మేలు జరిగిందన్న కేసీఆర్ లాక్ డౌన్ లేకుండా ఉంటే పరిస్థితి మరింత భయానకంగా మారి ఉండేదన్నారు. స్వీయనియంత్రణ మాత్రమే శ్రీరామ రక్ష అని ఆయన అన్నారు.

మనకేం కాదన్న ధీమా వద్దు:

కరోనా మనకు సోకదు, మనకేం కాదన్న ధీమా వద్దని కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పలువురు క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు.

కరోనా బాధితుల చికిత్సకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామన్నారు. అవసరమైన సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజల సహకారం అవసరమన్నారు. లాక్ డౌన్ ను, కర్ఫ్యూను కచ్చితంగా పాటించాలన్నారు.

దేశంలో విజృంభిస్తే 20 కోట్లమందికి సోకే ప్రమాదం:

కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం కూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. ఒక వేళ అమెరికా, చైనా స్థాయిలో దేశంలో కరోనా విజృంభిస్తే దేశంలో 20 కోట్ల మందికి కరోనా సోకే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు.

అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నదనీ, అయితే ప్రజా సహకారం కూడా అవసరరమని కేసీఆర్ చెప్పారు.

ఇక్కడున్న ఇతర రాష్ట్రాలవారిని పస్తులుంచం:

తెలంగాణలో ఉన్న ఏ రాష్ట్రం వారినీ పస్తు పడుకోపెట్టమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామన్నారు.

హాస్టళ్లు మూసేయరని ఆయన చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎక్కువ మంది ఉన్నారనీ వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.

ఇక ఏపీకి చెందిన విద్యార్థులు కొందరు భయపడుతున్నారని చెప్పిన ఆయన అటువంటి భయం అవసరం లేదని, హాస్టల్స్ మూసివేసే ఆలోచన లేదన్నారు.

కదలికలను నియంత్రించడం ద్వారా మాత్రమే ఈ విపత్తు నుంచి బయటపడగలమని అన్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/