ఎయిరిండియా విమానానికి తప్పిన పెనుప్రమాదం

ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. మస్కట్ నుంచి కొచ్చిన్ రావాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో (IX-442, VT-AXZ) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా రన్‌వేపై మంటలు చెలరేగడం, విమానం చుట్టూ దట్టమైన పొగ అల్లుకోవడంతో వెంటనే అధికారులు , సిబ్బంది విమానంలో ఉన్న 141 మంది ప్రయాణికులను, ఆరుగురు క్రూ సిబ్బందిని సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటన ఈ మధ్యాహ్నం మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం నంబర్ బీ737 (వీటీ ఏఎక్స్‌జెడ్) కేరళలోని కోచికి బయలుదేరడానికి సిద్ధపడిన సమయంలో అందులో దట్టమైన పొగ అలముకుంది. పొగ వెలువడిన వెంటనే పైలెట్, కోపైలెట్ ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. రెండో ఇంజిన్ నుంచి పొగ వెలువడినట్లు అధికారులు గుర్తించారు. విమానం నుండి కిందికి దిగిన వెంటనే ప్రయాణికులు విమానానికి దూరంగా పరుగులు తీయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.