ఆవహించడం కాదు! స్మార్ట్‌ఫోన్‌ వ్యసనం!

Smart Phone Addiction-

మా కోడలు స్మార్ట్‌ ఫోన్‌కు బానిసగా మారిపోయింది. నిరంతరం తన గదిలో ఒంటరిగా కూర్చుని సెల్‌ఫోన్‌తోనే గడుపుతున్నది. వంట, వార్పు, పిల్లల బాధ్యత ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అన్ని సామాజిక మాధ్యమాలు, అళ్లీలసైట్లు చూస్తూ గడుతున్నది. వేళకు తినడం, నిద్రపోవడం లాంటి మంచి అలవాట్లు ఎప్పుడో మరచిపోయింది. ఆమె శ్రేయస్సుకోరి ఎప్పుడైనా సెల్‌ఫోన్‌ తీసి పక్కన పెడితే అరచి గోల చేస్తుంది. కేకలు పెట్టడం, ఏడవడంతో పాటు ఆవాహం వచ్చిన దానిలా ప్రవర్తిసుంది. ఒక్కోసారి నీలగడం, చేతలు, కాళ్లు లాగుతున్నట్లు చేస్తూ క్రిందపడి దొర్లుతుంది.ఆమె పరిస్థితులు చూసిన వారు ఆమెకు పలు రకాల రుగ్మతల్ని ఆపాదిస్తున్నారు.

కొందరు ఏదో భూతం ఆవహించనిందంటుండగా, మరికొందరు హిస్టీరియాతో బాధపడుతుందంటున్నారు. అలాగే మానసిక ఒత్తిడిని కొందరు, డిప్రెషన్‌ అని కొందరు చెబుతున్నారు. మంత్రాలు వేయిస్తే మంచిది అనే వారితో పాటు సైకియాట్రిస్టుకు చూపమనే వారూ ఉన్నారు. ఇందరి అభిప్రాయాలలో ఏది సరైనదో తేల్చుకోలేకపోతున్నాను. మా కోడలి వయసు 28 యేళ్లు. బిటెక్‌ చదివి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. మా అబ్బాయికి 30 యేళ్లు. అతను కూడ బిటెక్‌ చదివి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు.

Smart Phone Addiction

ఇద్దరి అయిదేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లయిన కొత్తలో ఇద్దరూ బెంగుళూరులో ఉంటూ ఉద్యోగాలు చేసుకునే వారు. వెంట, వెంటనే ఇద్దరు పిల్లలు పుట్టడంతో ఆమె ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. నేను, నా భర్త వ్యవసాయం చేసుకుంటున్నాము. దీంతో మాకు తోడుగా ఉంటూ పిల్లల్ని పెంచుకోవచ్చని మా అబ్బాయి భావించి ఆమెను మా పల్లెలో ఉంచాడు. అతను వారం, వారం వచ్చి భార్యా, పిల్లలతో గడిపి వెళుతుంటాడు. కోడలు చదువుకున్నది కాబట్టి ఆమెను ఇంట్లోనే ఉంచి మేము పొలం పనులు చూసుకుంటున్నాము. నేను ఉదయమే లేచి ఇంటి పనులన్నీ చేసి, వంట చేసి పెట్టి పొలానికి వెళుతుంటాను. కాబట్టి ఆమెకు పెద్దగా పనేమీ ఉండదు.

పిల్లల్ని చూసుకోవడం, టివి సెల్‌తో గడపడం అలవాటుగా మార్చుకున్నది. పిల్లలిద్దరినీ ప్లే స్కూల్‌లో చేర్పించడంతో వారు స్కూలుకెళ్లి వచ్చే వరకు టివి లేదా స్మార్ట్‌ ఫోన్‌తో గడపడం దినచర్యగా మారింది. రాను రాను ఫోన్‌లో సామాజిక మాధ్యమాలు, అశ్లీల దృశ్యాలు చూడటమే లోకంగా మారిపోయింది. పిల్లలను, ఇతర చిన్న చిన్న పనులను పట్టించుకోవడం మానేసింది. ఎప్పుడు ఒంటరిగా ఉంటు తన గదికే పరిమితమై పోయింది. ఆరు నెలల క్రితం ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించి మా అబ్బాయి ఆమె ఫోన్‌ వాడకాన్ని పరిశీలించాడు.

ఫోన్‌లో ఆమె చూస్తున్న దృశ్యాలు, ఛాటింగ్‌లు చాల అభ్యంతరకంగా ఉన్నాయని గమనించాడు. సున్నితంగా ఆమెను మందలించే ప్రయత్నం చేశాడు. ఆమె తీవ్రంగా స్పందించి తన జీవితం తనిష్టమంటూ వాదించడంతో మా అబ్బాయి కొంత తగ్గాడు. అయితే సున్నితంగా ఆమెను ఫోన్‌కు దూరం చేయమని నాకు సలహా ఇచ్చాడు. అందుకని ఎప్పుడైనా ఆమె ఫోన్‌ తీసి పక్కన బెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఊగిపోతున్నది. రకరకాలుగా ప్రవర్తిస్తున్నది. ఆమెది ఆవాహమో, హిస్టీరియానో తెలియడం లేదు. ఎవరికి చూపాలో కూడ అర్ధం కావడం లేదు. కాబట్టి తగిన పరిష్కారమార్గాలు చూపగలరు. – సుమిత్రా దేవి

అమ్మా! మా కోడలి సమస్య ఆవాహమో, హిస్టీరియానో కాదు. ఆమె తీవ్రమైన స్మార్ట్‌ఫోన్‌ వ్యసనంతో బాధపడుతున్నది. తాగుబోతులు, మాదకద్రవ్యాల వ్యసనపరులలోను కనిపిస్తున్నది. సామాజిక మాధ్యమాలతో గడపడం, అశ్లీల దృశ్యాలు చూడడం కూడా ఒక వ్యసనంగానే భావించాలి. ఇది శృతి మించితే పలు రకాల మానసిక సమస్యలు, నాడీ రుగ్మతలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌ వ్యవసనం వల్ల శారీరక వ్యాయామాలు లేకపోవడం వల్ల నాడీ వ్యవస్థలో లోపాలు తలెత్తుతాయి.

అలాగే తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. వీటివల్ల భయం, ఆందోళన, కోపం, విసుగు, డిప్రెషన్‌, నిద్రలేమి, ఆకలి మందగంచడం లాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అందరిలోను అన్ని లక్షణాలు కనిపించకపోవచ్చు. కాని ఇందులో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కొంతమందిలో ప్యానిక్‌ డిజార్డర్‌ తలెత్తుతుంటుంది. ఇది కూడ ఒక విధంగా హిస్టీరియా, ఆవాహం లక్షణాలను పోలి ఉంటుంది. కాబట్టి మనం సమస్యను సరిగా నిర్ధారించలేక పోతుంటాము. కాబట్టి మీ కోడలు స్మార్ట్‌ఫోన్‌ వ్యసనంతో బాఢపడుతున్నదని గుర్తించండి. దానికి కారణం సరైన పని లేదా వ్యాపకం లేకపోవడం మొదటి కారణం. ఖాళీగా ఉండలేక స్మార్ట్‌ఫోన్‌తో గడపడం అలవర్చుకుంది.

అది వ్యసనంగా మారింది. అలాగే భర్తకు దూరంగా ఉండటం వల్ల అశ్లీల దృశ్యాలు చూడటానికి అలవాటు పడి ఉంటుంది. ఈ అలవాట్లు వ్యసనంగా మారడంతో పిల్లలు, ఇతర అంశాలను పట్టించుకోవడం మానేసింది. రాను, రాను శారీరక, నాడీ, మానసిక రుగ్మతలు తలెత్తాయి. ఈ దశలో ఉత్తుత్తి ఉపదేశాలు, నీతి వాక్యాలు పనిచేయవు.

తప్పనిసరగా సైకియాట్రిస్టు ద్వారా చికిత్స చేయించాలి. మద్యం వ్యసన విముక్తి కేంద్రాలలోని తరహాలో ఆమెకు చికిత్స, కౌన్సిలింగ్‌, జీవనశైలి నిర్వహణలో మార్పులు అవసరం. చికిత్స ప్రారంభించి కొంత ఉపశమనం కనిపించిన తరువాత కుటుంబం, పిల్లలు, లక్ష్యాలపై దృష్టి మరల్చడానికి ప్రయత్నించండి. నెమ్మది నెమ్మదిగా స్మార్ట్‌ఫోన్‌ వాడకాన్ని తగ్గిస్తూ ఇతర వ్యాపకాలు లేదా అభిరుచుల వైపు దృష్టి మరలించేందుకు కృషి చేయండి.
అలాగే మీ అబ్బాయి కూడా ఆమె పట్ల మరింత ప్రేమగా వ్యవహరించాలి. దాంపత్య జీవితానికి ఎక్కువ సమయం కేటాయించాలి. వీలైతే ఇద్దరూ ఒకే చోట ఉండేందుకు ప్రయత్నించడం మంచిది. అన్నీ ఆచరిస్తే ఆమె సాధారణ మనిషిగా మారుతుంది.

  • డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/