రాజీనామా చేసిన స్లొవేనియా ప్రధాని

Slovenian PM Marjan Sarec
Slovenian PM Marjan Sarec

జుబ్లుజనా : స్లొవేనియా ప్రధాని మార్జన్‌ సారెక్‌ తన పదవికి రాజీనామా చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందజేయలేకపోతున్నాననే కారణంతో పీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. 2018, సెప్టెంబర్‌లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో లిస్ట్‌ ఆఫ్‌ మార్జన్‌ సారెక్‌ పార్టీ తరఫున పోటీ చేసిన మార్జన్‌ సారెక్‌ గెలుపొందారు. 90 పార్లమెంట్‌ స్థానాలకుగానూ ఆయనకు 43 మంది ఎంపీలు మద్దతుగా నిలిచారు. పలు పార్టీల మద్దతుతో ఆయన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆయనకు మద్దతు తెలిపిన పలు పార్టీలు గతేడాది నవంబర్‌ నుంచి తమ మద్దతును ఉపసంహరించుకు న్నాయి. అప్పటి నుంచి పార్లమెంట్‌లో పలు కీలక బిల్లులకు కూడా ఆమోదం లభించడంలేదు. దీంతో, తీవ్ర మనస్తాపానికి గురైన మార్జన్‌ సారెక్‌ తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. మార్జన్‌ రాజీనామాకు ముందే స్లొవేనియా ఆర్థిక మంత్రి ఆండ్రీజ్‌ బెర్టోన్‌సెల్జ్‌ కూడా రాజీనామా చేసినట్టు స్టేట్‌ మీడియా ప్రకటించింది. కాగా, స్లొవేనియాలో 2022లో పార్లమెంట్‌ ఎన్నికలు జరుగునున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే వ్యూహంతోనే మార్జన్‌ ప్రధాని పదవికి రాజీనామా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/