డైటీషియన్‌ సలహాతో …

మీరు అధిక బరువుతో బాధపడుతూ డైటింగ్‌ చేయాలను కుంటున్నపుడు ముందుగా డైటీషియన్‌ను కలవండి. అనుభవ జ్ఞులైనవారు ఇచ్చిన సూచనల మేరకు డైటింగ్‌ను ప్రారంభించండి.

Sliming with Diet
Sliming with Diet

డైటింగ్‌ మొదలు పెడుతున్నారు అంటే అప్పటివరకు మీరు ఎంతో ఇష్టంగా భుజిస్తున్న చాలా రుచులకు దూరం కావాల్సి ఉంటుంది. అలా మీ కిష్టమైనవి మీరూ రోజూ అపరిమితంగా తినేవి, అలవాటుగా భోజనంతో పాటు లేదా భోజనానికి బదులు తీసుకునేవి ఏంటో జాబితా రాసుకోండి. ముందుగా వాటికి దూరంగా ఉండడానికి మానసికంగా సిద్ధంకండి. ముందుగానే ఇవి తినడం వల్లే నేను ఇలా తయారవుతున్నాననే వ్యతిరేక భావనకురండి. అప్పుడే మీరు వాటికి దూరంగా ఉండగలుగుతారు. ఆ తరువాత ఆహార నియంత్రణ చేయటం చాలా సులభం. లావుగా ఉన్నంత మాత్రాన మీరు అధిక శక్తిమంతులు కాదు అనే విషయం గుర్తుపెట్టు కోండి.

అలాగే ఆరోగ్యం విషయంలో కూడా. అందుకే డైటింగ్‌ ప్రారంభానికి ముందు మీ శారీరక, మానసిక సామర్థ్యాల స్థితిని అంచనా వేసుకోండి. దానికి సంబంధించి అవసరమైతే డాక్టరును సంప్రదించండి.

మీ మొత్తం శరీరాకతిని నిలువుటద్దం ముందు చూసుకోండి. ఏ ప్రదేశం మీ అందమైన శరీరాకతికి భంగం కలిగిస్తుందో గుర్తించండి. అది సరైన ఆకతిలోకి రావాలంటే డైటింగ్‌ తప్పని సరని భావించండి.
పదే పదే మీరు ఇలా చేయటం, కొద్దిరోజులకే వచ్చే మార్పును గమ నించి చూసుకోవటం చేస్తే ఇంకా అందంగా నాజూగ్గా తయారవ్వాలన్న ఉత్సాహం కలుగుతుంది. డైటింగ్‌ కచ్చితంగా అమలుచేయాలన్న పట్టుదలా ఏర్పడుతుంది. ఇవి చాలు మిమ్మల్ని క్రమం తప్పకుండా ఆహార నియమాలు పాటించేలా చేయడానికి.

డైటింగ్‌ను మీకొక శిక్షగా భావించకండి. అది మీకు శక్తినిస్తూ, మిమ్మల్ని అందంగా, ఆరోగ్యంగా, నాజూకుగా తయారుచేసే ఒక సాధనంగా అనుకోండి. అలాగే నవ్వుతూ, ఆనందంగానే పూర్తి ఇష్టంతోనే అవసరమైన ఆహార నియమాలు పాటించండి. అప్పుడే మీరు నిజమైన ఫలితాలు పొందగలుగుతారు.

సరైన ఆహార నియమాలు పాటించడంతో పాటు ప్రాణాయామం, యోగా వంటివి క్రమం తప్పకుండా చేస్తే అవి మరింత శక్తిని మీకందించటంలో తోడ్పడతాయి.

మీకిష్టమైన వంటలను కూడా డైటింగ్‌కు అనుకూలంగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేస్తే డైటింగ్‌కూడా బావుం దనిపిస్తుంది. తినే సమయంలో తప్ప మిగతా సమయాలలో కిచెన్‌కు దూరంగా ఉండటం అలవాటు చేసుకుంటే మంచిది. ఇలా చేస్తే అస్తమానూ ఏదొకటి తినే అలవాటు కూడా దూరమౌతుంది. ఏదొక పనిలో నిమగ్నమై ఉండటం, ఖాళీ సమయంలో నడక, మ్యూజిక్‌ వినటం వంటివి మీలో వ్యతిరేక ఆలోచనల్ని దూరం చేస్తాయి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవటం, మీలోని మార్పులను చూసుకుని మీతో మీరే మాట్లాడుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేసుకోవటం అప్పుడప్పుడూ చేస్తూ ఉంటే చేసే పనిపై ఆసక్తి పెరుగుతుంది. శరీరానికి క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం లేకపోతే ఎలాంటి డైటింగ్‌ అయినా సత్ఫలితాలను ఇవ్వదు. ఇది ప్రధానంగా గుర్తుంచుకోవలసిన విషయం. ఎంత చక్కగా ఆహారనియంత్రణ అమలుచేసినా వ్యాయామం ప్రధానం.