నాజూకుగా..

Slim
Slim

నాజూకుగా..

కొన్నిరకాల పదార్థాలు మానేసి, మరికొన్నింటిని తీసుకుంటే సన్నబడటం సులువే. అయితే దాంతోపాటూ చేసుకోవాల్సిన మార్పులూ మరికొన్ని ఉన్నాయి. పొద్దున టిఫిన్‌, రెండుపూటల భోజనం. ఇంతేగా అనుకుంటే చాలదు. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. దీనివల్ల తక్కువ కేలరీలు అందుతాయి. శరీరం ఇన్సులిన్‌ని తక్కువగా విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెరస్థాయిలు అదుపులో ఉంటాయి. అదే ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా బరువూ అదుపులో ఉంటుంది. కప్పు నిండా ఐస్‌క్రీం, పైన నాలుగైదు రకాల పండ్లముక్కలతో తినే అలవాటు తగ్గించుకోండి. బదులుగా కప్పు నిండా పండ్లముక్కలు తీసుకుని దానిపైన చెంచా ఐస్‌క్రీం వేసుకోండి.

సలాడ్‌పై చాలా కొద్దిగా చీజ్‌ వేసుకోవడంలాంటివన్నీ కేలరీలు తగ్గించే ప్రత్యామ్నాయాలే. పొద్దుటపూట టిఫిన్‌ తిన్నాక ఓ గ్లాసు బత్తాయీ, కమలాఫలం రసం తాగండి. వాటివల్ల తక్కువ కేలరీలు అందుతాయి. పొట్ట నిండినట్లుగా ఉంటుంది. దాంతో అదేపనిగా ఎక్కువగా తినడం జరగదు. ఆకలితో సంబంధం లేకుండా, మీ ముందు ఎంతఎక్కువ ఆహారం ఉంటే అంత ఎక్కువగా తినేస్తారని ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. దీన్ని అధిగమించాలంటే చిన్న పళ్లెం తీసుకుని, కొద్దిగానే వడ్డించుకో వాలి. దానివల్ల తెలియకుండానే తక్కువగా తీసుకుంటాం.