కశ్మీర్ బయల్దేరిన ఏచూరి

న్యూఢిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి ఈరోజు శ్రీనగర్ బయల్దేరారు. ఉదయం ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఆయన మరికాసేపట్లో శ్రీనగర్ చేరుకోనున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌కు వెళ్తున్న తొలి విపక్ష నేత ఈయనే. ఇటీవల శ్రీనగర్ వెళ్లేందుకు ఏచూరి రెండు సార్లు ప్రయత్నించగా.. ఎయిర్‌పోర్టు నుంచే పోలీసులు వెనక్కి పంపారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా పలువురు రాజకీయ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే. వారిలో సీపీఎం నేత యూసఫ్ తరిగామి కూడా ఉన్నారు. అయితే నిర్బంధంలో ఉన్న తరిగామి అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల ఆయనను చూసేందుకు ఏచూరి వెళ్లగా.. ఆంక్షల పేరుతో పోలీసులు అడ్డుకున్నారు. తరిగామి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఏచూరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై నిన్న విచారణ జరిపిన న్యాయస్థానం ఏచూరి కశ్మీర్‌కు వెళ్లేందుకు అనుమతించింది. అయితే అక్కడికి వెళ్లిన తరవాత తరిగామిని మాత్రమే కలవాలని.. నిబంధనలు ఉల్లంఘిచవద్దని ఆదేశించింది. ఒకవేళ ఆదేశాలు ఉల్లఘించినట్లయితే నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/