బండి సంజయ్‌కు సిట్ నోటీసులు?

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్‌కు నోటీసులు ఇవ్వాలని భావిస్తున్న సిట్

sit-to-issue-notice-to-bandi-sanjay-in-relation-to-tspsc-paper-leak-case

హైదరాబాద్‌ః తెలంగాణ పదో తరగతి ప్రశ్న పత్రం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు టీఎస్‌పీఎస్‌సీ కేసుకు సంబంధించి సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) మరోసారి నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పదో తరగతి ప్రశ్న పత్రంలో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంజయ్‌ను జైలులోనే విచారించాలని సిట్ భావిస్తున్నట్టు సమాచారం. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌కు సంబంధించి బండి సంజయ్ వద్ద ఉన్న ఆధారాలను బయటపెట్టాలంటూ సిట్ గతంలో నోటీసులు జారీ చేసింది. తమ ముందు హాజరుకావాలని కోరింది. అయితే బండి సంజయ్‌కు బదులు ఆయన తరపు న్యాయవాదాలు సిట్‌ ముందు హాజరయ్యారు.

ప్రస్తుతం సంజయ్ రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో ఆయనను నేరుగా జైలులోనే ప్రశ్నించేందుకు సిట్ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ దిశగా కోర్టు అనుమతి తీసుకుని, నోటీసులు జారీ చేశాక ఆయనను ప్రశ్నించాలని భావిస్తున్నట్టు సమాచారం. గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా సిట్ ఇదే తరహా నోటీసులు జారీ చేసింది. దీంతో రేవంత్ వ్యక్తిగతంగా సిట్‌ ముందు హాజరై తన వాదనలు వినిపించారు.