సిరివెన్నెల చివరి పాటలు ఏ సినిమాలో అంటే..

చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఈ వార్త ఇప్పుడు యావత్ ప్రేక్షకులను , సినీ ప్రముఖులను శోకసంద్రంలో పడేసింది. న్యుమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల.. నవంబర్ 24 న హైదరాబాద్‌లోకి కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.

1955 , మే 20వ తేదీన విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించిన సిరివెన్నెల.. బాలకృష్ణ హీరోగా కళాతపస్వీ కే. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనని జన్మభూమి’ సినిమాతో గేయ రచయతగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. 1986లో కే.విశ్వనాథ్ తెరకెక్కించిన ‘సిరివెన్నెల’ సినిమాకు అన్ని పాటలు రాసి ఈ సినిమాతో చెంబోలు సీతారామశాస్త్రి కాస్తా సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా పేరు తెచ్చుకున్నారు. ‘సిరివెన్నెల’ సినిమాతో అవార్డులు సొంతం చేసుకున్న సీతారామ శాస్త్రి.. కెరీర్లో ఉత్తమ గేయ రచయితగా 11 నంది అవార్డులు.. 4 ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకున్న ఆయనకు 2019 సంవత్సరంలో పద్మ శ్రీ పురస్కారం దక్కింది. RRR సినిమాలో సిరివెన్నెల ‘దోస్తీ’ పాట సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సిరివెన్నెల చివ‌ర‌గా నాని హీరోగా న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ సినిమాలో రెండు పాట‌లు రాశారు.. అవే ఆయన చివ‌రి పాట‌లు అయ్యాయి.