సైనిక లాంఛ‌నాల‌తో కేకే పార్థీవ‌దేహానికి నివాళులు..మమతా బెనర్జీ హాజరు

కోల్‌క‌తా: కోల్‌క‌తాలో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన పాపుల‌ర్ సింగ‌ర్ కేకే పార్దీవ దేహాన్ని ఎస్ఎస్‌కేఎం ఆస్ప‌త్రి నుంచి ప్ర‌భుత్వ లాంఛ‌నాల నిమిత్తం ర‌వీంద్ర‌స‌ద‌న్ కు త‌ర‌లించారు. ర‌వీంద్ర స‌ద‌న్‌లో కేకే పార్ధీవ‌దేహానికి సైనిక లాంఛ‌నాల‌తో నివాళుల‌ర్పించారు. జ‌వాన్లు గాల్లోకి తూటాలు పేల్చ‌గా..ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మత బెన‌ర్జీ తోపాటు కుటుంబ‌స‌భ్యులు కేకే పార్థీవ‌దేహంపై పుష్ప‌గుచ్చం ఉంచి నివాళుల‌ర్పించారు.

‘అద్బుత‌మైన టాలెంట్ ఉన్న యువ గాయ‌కుడు కేకే ఆక‌స్మిక మృతి బాధాక‌రం. ఆయ‌న గురించి ఏమి చెప్పగలను? ‘ అని సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కేకే ఆక‌స్మిక మ‌ర‌ణంపై బాలీవుడ్ కంపోజ‌ర్‌ ఇస్మాయిల్ దర్బార్ మాట్లాడుతూ..ఇవాళ‌ నా పుట్టినరోజు. ఈ రోజు కేకే లాంటి మంచి స్నేహితుడిని, ప్రతిభావంతులైన గాయకుడిని కోల్పోవడం న‌న్ను ఎంతో నిరుత్సాహపరుస్తుంది. కేకే చాలా మంచి మనిషి.నిజాయితీ గల వ్యక్తి. కేకేతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు.

కాగా, తెలుగు, త‌మిళం, హిందీతోపాటు వివిధ భాష‌ల్లో ఎన్నో సూప‌ర్ హిట్ సాంగ్స్ పాడిన కేకే హఠాన్మ‌ర‌ణం ప‌ట్ల‌ సినీ, సంగీత ప్ర‌పంచం తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేస్తోంది. 53 ఏండ్ల కేకే కోల్‌క‌తాలో మంగ‌ళ‌వారం రాత్రి మ్యూజిక్ కాన్స‌ర్ట్‌లో పాల్గొన్నారు. ఆ త‌ర్వాత హోట‌ల్ గదిలో కుప్ప‌కూలిపోగా..వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించినా ఫ‌లితం లేకుండా పోయింద‌ని వైద్యులు వెల్ల‌డించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/