సింగరేణి కాలనీ లో దీక్ష చేస్తున్న షర్మిల , విజయమ్మ

సైదాబాద్ సింగరేణి కాలనీ లో వైస్ షర్మిల దీక్ష కొనసాగుతూనే ఉంది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేవరకు దీక్ష కొనసాగిస్తానని తేల్చి చెపుతుంది. షర్మిల తో పాటు విజయమ్మ సైతం దీక్ష లో కూర్చుంది. చిన్నారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆమె అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించలేదని.. బాధితులు ఎస్టీలు కావడం వల్లే స్పందించడం లేదా అని మండిపడ్డారు. తక్షణం ఈ ఘటనపై కేసీఆర్ స్పందించాలని .. ఆ చిన్నారి కుటుంబానికి నష్టపరిహారంగా రూ. పది కోట్లు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకూ తాను దీక్షను విరమించబోనని ప్రకటించారు.

కేసీఆర్ ఇంట్లో కుక్క హస్కీ చనిపోతే డాక్టర్ను ఉద్యోగం నుంచి తీసేసిన కేసీఆర్, చిన్నపిల్లపై అత్యాచారం జరిగితే ఎందుకు స్పందించరు. హంతకుడు దొరికాడా లేదా తెలుసుకోని మంత్రి.. ప్రజలకు సేవ చేసేందుకు ఎంత సమయం కేటాయిస్తున్నాడో అర్థమౌతుంది. ప్రజలకు సరైన సమాచారం ఇవ్వలేని కేటీఆర్ మంత్రి కావడం మన దౌర్భాగ్యం. కేసీఆర్ హుజురాబాద్ కే ముఖ్యమంత్రా..? ఎన్నికలు వస్తేనే బయటకు వస్తారు. మహిళలపై లైంగికదాడులు సీఎం కేసీఆర్ హయాంలో మూడురెట్లు అధికమయ్యాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ మత్తులోనే ఉంటారు. రాష్ట్రంలో డ్రగ్స్, మద్యం, గంజాయి విచ్చలవిడిగా పెరిగాయి. అప్పుల తెలంగాణ, బార్ల తెలంగాణ, బీర్ల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణ గా మార్చారు.” అంటూ షర్మిల ధ్వజమెత్తారు. షర్మిల ఒక్క సారిగా దీక్షకు కూర్చోవడంతో పోలీసులు షాక్ లో పడ్డారు. గత రెండు, మూడు రోజుల నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతల సింగరేణి కాలనీకి వస్తున్నారు. పరామర్శించి వెళ్తున్నారు. ఈ కారణంగా పోలీసులు కూడా ఎవరికీ అడ్డు చెప్పలేదు. షర్మిల కూడా అలాగే వెళ్లిపోతారని అనుకున్నారు. కానీ ఆమె దీక్ష చేపట్టడం ఇప్పుడు వారికీ మరో టెన్షన్ గా మారింది. ఇప్పటికే నిందితుడిని పట్టుకోవడం లో పోలీస్ శాఖ విఫలమైందనే విమర్శలు వస్తుండగా..ఇప్పుడు షర్మిల దీక్ష చేపట్టడం వారిని మరింత ఇరకాటంలో పడేసినట్లు అయ్యింది.