ఏప్రిల్‌ 2న సింగరేణి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

సింగరేణి సంస్థలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించడం తో ఏప్రిల్ 02 న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది. సోమవారం హైదరాబాద్‌లోని ఆర్‌ఎల్‌సీ కార్యాలయంలో కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా నియమితులైన శ్రీనివాసులు ఏప్రిల్‌ 2న ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు.

ఈ సమావేశానికి 32 కార్మిక సంఘాలను ఆహ్వానించగా, 15 సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. కార్మిక సంఘాల ఎన్నికల కాల పరిమితి 4 సంవత్సరాలు ఉండాలని టీబీజీకేఎస్‌, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంస్‌ ఎన్నికల అధికారిని కోరాయి. దీనిపై స్పందించిన శ్రీనివాసులు.. అది తమ పరిధిలో లేదని స్పష్టం చేశారు. సీఐటీయూ, బీఎంఎస్‌ సంఘాలు మాత్రం రెండేండ్ల కాలపరిమితికి అంగీకరిస్తున్నట్టు పేర్కొన్నాయి. కాంట్రాక్ట్‌ కార్మికులకు ఓటు హక్కు కల్పించాలని కొన్ని సంఘాలు కోరినా అది సాధ్యపడదని, పర్మినెంట్‌ కార్మికులకు సంబంధించి ఎన్నికలు జరుగుతాయని రిటర్నింగ్‌ అధికారి స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్లు ప్రవేశపెడతామని ఆర్వో చెప్పగా.. కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు జరపాలని కోరాయి. 45 రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో మే చివరి వారంలో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి.