సింగపూర్‌ క్వార్టర్స్‌లో సింధు, సైనా, శ్రీకాంత్‌…

PV Sindhu, Saina Nehwal and Srikanth Kidambi
PV Sindhu, Saina Nehwal and Srikanth Kidambi

సింగపూర్‌ ఓపెన్‌లో భారత స్టార్‌ షట్లర్లు పివి సింధు, సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌, సమీర్‌ వర్మలు దూసుకెళ్తున్నారు. వీరందరూ సింగిల్స్‌ విభాగంలో అద్భుతంగా రాణించి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. అయితే పారుపల్లి కశ్యప్‌ మాత్రం ఇంటిదారి పట్టాడు. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో నాలుగో సీడ్‌ సింధు 21-13, 21-19తో డెన్మార్క్‌కి చెందిన మియా బ్లిఫెల్డ్‌ట్‌పై గెలుపొందింది. 39నిమిషాల పాటు సాగిన ఈమ్యాచ్‌లో మియాను వరుస గేముల్లో ఓడించింది. మొదటి గేమ్‌లో సింధు సునాయాసంగా గెలిచినా…రెండో గేమ్‌లో మాత్రం ప్రతిఘటన ఎదురైంది. క్వార్టర్‌ ఫైనల్లో సింధు చైనాకి చెందిన కాయి యాన్యాన్‌ తలపడుతుంది. మహిళల సింగిల్స్‌ రెండోరౌండ్‌లో ఆరో సీడ్‌ సైనా నెహ్వాల్‌ 21-16, 18-21, 21-19తో పోర్న్‌ పావీ చోచువాంగ్‌ (థా§్‌ులాండ్‌)పై విజయం సాధించింది. గతవారం ముగిసిన మలేషియా ఓపెన్‌ మొదటి రౌండ్‌లోనే సైనాను చోచువాంగ్‌ ఓడించింది. క్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన నొజోమీ ఒకుహరతో సైనా అమీతుమీ తేల్చుకోనుంది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 21-12, 23-21తో క్రిస్టియన్‌ విట్టింగస్‌ (డెన్మార్క్‌)ను మట్టికరిపించారు. 41నిమిషాల పాటు ఈమ్యాచ్‌లో విట్టింగస్‌ వరుస గేముల్లో కంగుతిన్నాడు. సమీర్‌ వర్మ చైనా ఆటగాడు లు గ్వాంగ్జూని 21-15, 21-18తో చిత్తు చేశాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో రెండో సీడ్‌ తైపీ క్రీడాకారుడు చౌ తియాన్‌ చెన్‌తో కానీ, డెన్మార్క్‌కి చెందిన జాన్‌ ఓ జోర్గెన్సన్‌తో కానీ తలపడనున్నాడు. పారుపల్లి కశ్యప్‌ 15-21, 21-16, 22-20తో చైనా క్రీడాకారుడు చెన్‌ లాంగ్‌ చేతిలో ఓడిపోయాడు. 71 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో కశ్యప్‌ ఓటమిపాలయ్యాడు.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/