మన హైదరాబాద్ లో సైమా వేడుక ..

సినీ స్టార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డ్స్ వేడుక అతి త్వరలో హైదరాబాద్ లో జరగబోతుంది. 2019 కు గాను సైమా అవార్డ్స్ అందజేయబోతుంది. వాస్తవానికి గత ఏడాది ఈ అవార్డ్స్ వేడుక జరగాల్సి ఉండగా..కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. ఈ ఏడాది కూడా ఉంటుందో ఉండదో అని అంత భావిస్తున్న వేళా సైమా అవార్డ్స్ వేడుకను తేదీని ప్రకటించి సంతోషం నింపింది. హైదరాబాద్‌ వేదికగా సెప్టెంబరు11, 12 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 2019 సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే పలు విభాగాల నామినేషన్లు వెలువడ్డాయి. తాజాగా ఉత్తమ విలన్‌, ఉత్తమ సింగర్‌ నామినేషన్ల వివరాల్ని సైమా ప్రకటించింది.

ఉత్తమ గాయకుడి నామినేషన్ల విషయానికి వస్తే..

అనురాగ్‌ కులకర్ణి (ఇస్మార్ట్‌ శంకర్‌ టైటిల్‌ గీతం), శంకర్‌ మహదేవన్‌ (పదర పదర- మహర్షి), ఎం.ఎల్‌.ఆర్‌. కార్తికేయన్‌ (తందానే తందానే- వినయ విధేయ రామ), సిధ్ శ్రీరామ్‌ (అరెరె మనసా- ఫలక్‌నుమాదాస్‌), సుదర్శన్‌ అశోక్‌ (ప్రేమ వెన్నెల- చిత్ర లహరి) పోటీపడుతున్నారు.

ఉత్తమ విలన్‌ కేటగిరీ చూస్తే.. జగపతి బాబు (మహర్షి), రెజీనా కస్సాండ్ర (ఎవరు), కార్తికేయ (నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌), వివేక్‌ ఒబెరాయ్‌ (వినయ విధేమ రామ), సోనూసూద్‌ (సీత) పోటీపడుతున్నారు.

ఉత్తమ గాయని విషయానికి వస్తే.. చిన్మయి (ప్రియతమ ప్రియతమ -మజిలీ), సునిధి చౌహాన్‌, శ్రేయా ఘోషల్‌ (సైరా టైటిల్ గీతం), మంగ్లి (వాడు నడిపే బండి- జార్జిరెడ్డి), సత్య యామిని, మోహన భోగరాజు, హరితేజ (ఓ బావ- ప్రతిరోజూ పండగే), యామిని ఘంటసాల (గిర గిర- డియర్‌ కామ్రేడ్‌) పోటీపడుతున్నారు. మరి వీరిలో ఎవరికీ సైమా అవార్డ్స్ దక్కుతాయో చూడాలి.

2012లో ఈ అవార్డుల కార్యక్రమం మొదలుకాగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించడం ఈ వేడుక ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పటివరకు 8 సార్లు అట్టహాసంగా ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. కానీ ఆ కార్యక్రమాలన్నీ విదేశాల్లోనే జరిగాయి. ఇప్పుడు తొలిసారి హైదరాబాద్‌ వేదికగా సైమా అవార్డ్స్‌ వేడుక జరగనుంది. సౌత్‌ సినీ పరిశ్రమకు చెందిన తారలంతా ఒకే వేదికపైకి వచ్చి చేసే ఆ సందడి వేరే లెవల్‌లో ఉంటుంది. అందాల ముద్దుగుమ్మలు స్టైలిష్‌ డ్రెస్‌లలో స్టేజీపై హొయలు పోతుంటే ఫ్యాన్స్‌ ఫిదా అవ్వాల్సిందే. అలాంటి వేడుక ఇప్పుడు హైదరాబాద్ లో జరగబోతుంది.