కోవీషీల్డ్ టీకా బూస్ట‌ర్ డోసు..అనుమ‌తి కోరిన సీరం సంస్థ‌

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్‌ కలకలం నేప‌థ్యంలో కోవీషీల్డ్ టీకాను బూస్ట‌ర్ డోసు రూపంలో ఇచ్చేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని సీరం సంస్థ భార‌త డ్ర‌గ్ నియంత్రణ సంస్థ వ‌ద్ద ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ది. త‌మ కంపెనీకి చెందిన కోవీషీల్డ్ టీకాను బూస్ట‌ర్ డోసుగా ఇచ్చేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని డీసీజీఐని కోరింది. త‌మ వ‌ద్ద కావాల్సిన‌న్ని టీకాలు నిలువ‌ ఉన్న‌ట్లు ఆ సంస్థ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా క‌రోనాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ ద‌డ పుట్టిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇండియాలో బూస్ట‌ర్ డోసు ఇచ్చేందుకు అనుమ‌తి కోరిన తొలి సంస్థ‌గా సీరం నిలుస్తోంది. అయితే జాతీయ సాంకేతిక అడ్వైజ‌రీ గ్రూపు ఇచ్చే నివేదిక ఆధారంగా బూస్ట‌ర్ డోసుపై నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంట్‌లో స్ప‌ష్టం చేసింది. రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, క‌ర్నాట‌క‌, కేర‌ళ లాంటి రాష్ట్రాలు బూస్ట‌ర్ డోసు కావాలంటూ కేంద్రాన్ని కోరాయి. ఆక్స్‌ఫ‌ర్డ్ శాస్త్ర‌వేత్త‌లు కొత్త వేరియంట్‌ను త‌ట్టుకునే వ్యాక్సిన్‌ను త్వ‌ర‌లో రూపొందించ‌నున్న‌ట్లు ఇటీవ‌ల సీరం సంస్థ సీఈవో ఆధార్ పూనావాలా తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/