కోహ్లిపై ప్రశంసల జల్లు

టీమిండియా అంటే ఏమిటో చాటాలని కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు : బట్లర్‌

Jose Butler-Kohli
Jose Butler-Kohli

చెన్నై : ఆస్ట్రేలియా పర్యటనలో భారత విజయంలో కడదాకా పాలుపంచుకోని కెప్టెన్‌ కోహ్లి స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను గెలుచుకుని సత్తా చూపాలన్న కసితో ఉన్నాడని ఇంగ్లండ్‌ వికెట్‌కీపర్‌ జోస్‌ బట్లర్‌ అన్నాడు. ఇండియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు స్థానిక చెపాక్‌ స్టేడియంలో ఈ నెల 5న ప్రారంభం కానున్నది.

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు అనంతరం కోహ్లి పితృత్వ సెలవ్ఞపై స్వదేశానికి వచ్చాడు. అప్పటికే టీమిండియా 0-1తో వెనుకంజలో ఉంది. ఆ తరువాత రెండు, నాలుగు టెస్టులను గెలుచుకుని సిరీస్‌ను సొంతం చేసుకున్న జట్టు బలమేమిటో ప్రపంచానికి చాటింది. ఈ వారం ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టులో మళ్లీ పగ్గాలు చేపట్టి టీమిండియా అంటే ఏమిటో చాటాలని కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడని బట్లర్‌ వ్యాఖ్యానించాడు. ‘విరాట్‌ మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. టెస్టులకు స్వల్ప విరామమిచ్చిన అతడు విజయానికి అర్రులు చాస్తున్నాడు.

కోహ్లి నేతృత్వంలో టీమిండియాను ఎదుర్కోవడం సవాల్‌తో కూడుకున్నది అని బట్లర్‌ వర్చువల్‌ విలేకరుల సమావేశంలో తెలిపాడు. టెస్టు చరిత్రలో గొప్ప విజయాల్లో ఒకటిగా చెప్పుకోదగ్గ ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లి జట్టును వీడే సమయానికి ఎవరూ సిరీస్‌ ఫలితాన్ని ఊహించలేదు. టీమిండియా అనూహ్యంగా పుంజుకుని సిరీస్‌ను గెలవడం పండితుల అంచనాలకే అందని విషయం. ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా, అంతగా అనుభవం లేని జట్టుతోనే టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకున్న తీరు అద్భుతమని బట్లర్‌ కొనియాడాడు.

ఎనిమిదిమంది ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా టీమిండియా సిరీస్‌ను గెలిచిన తీరు భారత జట్టు బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అంచనా వేయలేమని బట్లర్‌ అన్నాడు.

కోహ్లి వికెట్‌ కష్టమే…మొయిన్‌

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఎలా అవ్ఞట్‌ చేయాలో ఇంగ్లండ్‌ బౌలర్లవద్ద ప్రణాళికలు లేవని, కోహ్లికి ఎలాంటి బలహీనతలు లేవని, ప్రపంచ ఉత్తమ బ్యాట్స్‌మన్‌లో కోహ్లి ఒకడని ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ మొయిన్‌ అలి వ్యాఖ్యానించాడు.

చాపెల్‌ ఓటు ఇండియాకే

ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌లో టీమిండియానే ఫేవరెట్‌ అని ఆస్ట్ల్రేలియా దిగ్గజం ఇయాన్‌ చాపెల్‌ అన్నాడు. భారత జట్టుకు మేలిమి పేసర్లు ఉన్నారని, బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఎంతో లోతుగా ఉందని, నిలకడైన ఆటగాళ్లు వారి సొంతమని, అది ఆస్ల్రేలియా పర్యనటలో రుజువైందని చాపెల్‌ వ్యాఖ్యానించాడు. ద్వితీయ శ్రేణి అటగాళ్లతోనే ఆస్ట్రేలియాపై నెగ్గిన జట్టు ఇపుడు కోహ్లి చేరికతో మరింత బలీయంగా రూపుదిద్దుకుందన్నాడు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/