ఇక రోజంతా రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌ ఓపెన్ చేసుకోవచ్చు.. తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు

తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఫై 24 గంటల పాటు దుకాణాలు, రెస్టారెంట్లు, మాల్స్ ఓపెన్ చేసుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1988ను తెలంగాణ ప్రభుత్వం సవరించింది. సెక్షన్ 7 ప్రకారం లైసెన్సు తీసుకున్న దుకాణాలు ఏవైనా ఇక నుంచి 24 గంటలు తెరిచే ఉంచేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అయితే.. ఇందుకోసం సంవత్సరానికి రూ. 10 వేల చొప్పున ఎక్స్‌ట్రా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలా కట్టిన వారికి సంవత్సరం పొడవునా 24/7 దుకాణం తెరిచే ఉంచుకోవచ్చని… కార్మిక ఉపాధి కల్పన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు ఈ నెల 4వ తేదీన జారీ చేయగా… శుక్రవారం రాత్రి వెలుగులోకి రావటం గమనార్హం. అయితే, ఇందుకు సంబంధించి కొన్ని షరతులను కూడా విధించింది. ఆయా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, దుకాణదారులు తమ ఉద్యోగులకు ఐడీ కార్డులు ఇవ్వాలి. వారాంతపు సెలవులు ఇవ్వడంతోపాటు వారానికి వారి పనిగంటలను నిర్దేశించాలి. షిఫ్ట్‌కు మించి పనిచేస్తే ఎన్ని గంటలు పనిచేసిందీ లెక్కగట్టి అదనపు వేతనం చెల్లించాలి.

ప్రభుత్వ సెలవు దినాల్లో పనిచేస్తే అందుకు సంబంధించిన వేతనం ఇవ్వాల్సి వస్తుంది. మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలి. నైట్ షిఫ్ట్‌లో పనిచేసే ఉద్యోగుల నుంచి ముందుగానే వారి అంగీకారం తీసుకోవాల్సి ఉంటుంది. వారి రాకపోకలకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆయా షాపులు కచ్చితమైన రికార్డులు నిర్వహించాలి అని తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై యాజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి షాపులు తొందరగా మూసెయ్యాలి.. లేదంటే పోలీసులు వస్తారు అంటూ భయపడాల్సిన పని లేదు. 24 గంటల పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా వ్యాపారం చేసుకోవచ్చు. అలానే కస్టమర్లు కూడా లేట్‌ అయ్యింది.. షాప్‌ ముసేస్తారేమో అనే భయం లేకుండా.. ఎంచక్కా తాపీగా, నిదానంగా షాపింగ్ చేసుకోవచ్చు. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో.. అటు దుకాణాదారులకు వ్యాపారం పెరగటంతో పాటు కస్టమర్లకు కూడా ఏ సమయంలోనైనా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.