మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు..ముగ్గురి మృతి

గాయాలపాలైన మరో ఐదుగురు..నిందితుడి కోసం పోలీసుల గాలింపు

shooting-inside-michigan-state-university-in-us

వాషింగ్టన్ః అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ప్రముఖ మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. యూనివర్సిటీలోని బర్కీ హాల్, యూనియన్ బిల్డింగ్‌లో నిందితుడు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, ఐదుగురు గాయాలపాలయ్యారు.

కాల్పుల సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతూ ఒక్కో భవనాన్ని తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి మాస్క్ పెట్టుకున్నట్టు యూనివర్సిటీ పోలీసు అధికారి రాజ్‌మన్ తెలిపారు. యూనియన్ బిల్డింగ్‌ నుంచి నిందితుడు కాలినడకన వెళ్లిపోవడాన్ని కొందరు చివరిసారిగా చూసినట్టు చెప్పారు.

గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లోని వారు ఇళ్లల్లో జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు సూచించారు. అంతేకాకుండా.. 48 గంటల పాటు యూనివర్సిటీలో క్లాసులు, ఇతర క్యాంపస్ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు.

అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ కూడా ఒకటి. ఇక్కడి ఈస్ట్ లాన్సింగ్ క్యాంపస్‌లో సుమారు 50 వేల మంది గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు చదువుకుంటున్నారు.