బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం

ప్రమాదం కారణంగా నింగిలోకి దూసుకెళ్లిన వేలాది రాకెట్లు

fireworks factory explodes in Russia

మాస్కో: రష్యాలో ఈ తెల్లవారుజామున ఓ బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా ఫ్యాక్టరీలో నిల్వచేసిన రాకెట్లకు నిప్పు అంటుకోవడంతో వేలాది రాకెట్లు నింగిలోకి దూసుకెళ్లి మిరుమిట్లు గొలిపాయి. దక్షిణ రష్యాలోని పోర్టు సిటీ అయిన రోత్సోవ్ఆన్డాన్‌లో జరిగిందీ ఘటన. నూతన సంవత్సరం వేడుకల కోసం బాణసంచాను పెద్ద ఎత్తున నిల్వచేశారు. అగ్ని ప్రమాదం కారణంగా ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు సంభవించాయి. దీంతో భయపడిన ప్రజలు పరుగులు తీశారు. అయితే, ఆ తర్వాత బయటకు వచ్చి రాకెట్ల పేలుళ్లతో వివిధ రంగులతో అత్యంత సుందరంగా కనిపిస్తున్న నింగిని వీడియో తీస్తూ ఎంజాయ్ చేశారు. ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, వందలాది రాకెట్లతో కూడిన బాణసంచా నింగిలోకి దూసుకెళ్తుండడంతో వారికి సాధ్యం కాలేదు. దీంతో అదనపు సిబ్బందిని రప్పించి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం 400 మంది అగ్నిమాపక సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/