ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు షాక్ ..

ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తనపై అక్రమంగా నమోదు చేసిన పీడీ యాక్టును తొలగించాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ పీడీ యాక్ట్‌ అడ్వైజరీ బోర్డు కు విజ్ఞప్తి చేసారు. కాగా దీనిపై సమగ్ర విచారణ జరిపిన బోర్డు.. రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేయడాన్ని సమర్ధించింది. తనపై కక్షపూరితంగా పీడీ యాక్టు కేసు నమోదు చేశారని బోర్డు కు రాజాసింగ్ తెలిపారు. ఒక రాజకీయ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నందున కక్షతో పీడీ యాక్ట్ నమోదు చేసారని ఆరోపించారు. ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు.

రాజాసింగ్‌ విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, కొన్ని వర్గాల మధ్య చిచ్చురేపే విధంగా వ్యహరించడం వల్లే పీడీ యాక్టు ప్రయోగించామని తెలిపారు. గతంలో అతనిపై వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను బోర్డు ముందుంచారు. ఇరువర్గాల వాదనలు విన్న అడ్వైజరీ బోర్డు పీడీ యాక్టును కక్షపూరితంగా ప్రయోగించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అభిప్రాయపడింది. పోలీసులు పీడీ యాక్టు నమోదు చేయడాన్ని సమర్థించింది.