అప్రూవర్లుగా నీరవ్ మోడీ సోదరి పూర్వి మోడీ, ఆమె భర్త మయాంక్ మోహతా
మా జీవితాలు నాశనమయ్యాయి..సాక్ష్యాలు ఇస్తాం:

ముంబై: పంజాజ్ నేషనల్ బ్యాంకుకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి షాక్. బ్యాంకింగ్ రంగాన్ని పిఎన్‌బి కుంభకోణం కుదిపేసిన విషయం విదితమే. తాజాగా ఈ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ మోడీ సోదరి పూర్వి మోడీ, ఆమె భర్త మయాంక్ మోహతా అప్రూవర్లుగా మారారు.
నీరవ్ వల్ల తమ జీవితాలు నాశనమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాకుండా, ఈ కేసుకు సంబంధించి కీలక సాక్ష్యాధారాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇది నీరవ్‌కు ఊహించిన భారీ షాక్. పూర్వీ మోడీ, ఆమె భర్త మయాంక్ మెహతాలు అప్రూవర్లుగా మారేందుకు, ప్రాసిక్యూషన్ విట్‌నెస్‌కు ముంబై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ కోర్టు ఆమోదం తెలిపింది.
ఈ జంట గత నెలలో అప్రూవర్లుగా మారుతామంటూ కోర్టును ఆశ్రయించారు. నీరవ్ మోడీ కేసు నుంచి తమకు సంబంధం లేదని, ఈ కేసుకు సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలను అందిస్తామని కోర్టుకు తెలిపినట్లుగా వార్తలు వచ్చాయి. నీరవ్పైన కేసుల వల్ల తమ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాలు దుర్భరంగా మారినట్లు తెలిపారు.
ఈ కేసులో పూర్వి మోడీ క్షమాపణ కోరి, సాక్ష్యాలు అందించిన తర్వాత అప్రూవర్‌గా పేర్కొనాలని కోర్టు జనవరి 6న ఆదేశాలు జారీచేసింది. బెల్జియం పౌరసత్వం కలిగిన పూర్వి ఇడి నమోదు చేసిన కేసులో ప్రస్తుతం నిందితురాలు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఈ నిందితులు కోర్టు ముందు హాజరుకావాలని, ప్రాసిక్యూషన్ అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తాము దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని పూర్వి, మయాంక్ తమ ప్రకటనలో తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/