బీజేపీతో పొత్తు పెట్టుకుని పాతికేళ్ల సమయాన్ని వృథా చేసుకున్నాం

ఒంటరిగా పోటీ చేసి గెలవాలన్న బీజేపీ సవాల్ ను స్వీకరిస్తున్నాం: ఉద్ధవ్ ఠాక్రే

ముంబయి: బీజేపీపై ఒంటరిగా పోటీ చేసి గెలవాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విసిరిన సవాల్ ను తాము స్వీకరిస్తున్నామని శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా శివసేన పాతికేళ్ల విలువైన సమాయాన్ని వృథా చేసుకుందని వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాలకు ఆ పార్టీ హిందుత్వను వాడుకుంటోందని… అధికారం కోసం తామెప్పుడూ ఆ పని చేయలేదని అన్నారు.

రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో పలు ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుందని… వాటిలో శివసేన ఒకటని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హిందుత్వ అజెండాను అమలు చేయాలన్న ఉద్దేశంతో తాము బీజేపీతో చేతులు కలిపామని… అంతేకాని అధికారంలోకి రావడం కోసం హిందుత్వను వాడుకోలేదని అన్నారు. బీజేపీ అధికారం కోసం పాకులాడుతోందని… హిందుత్వ అవకాశవాదిగా మారిపోయిందని చెప్పారు. అమిత్ షా సవాల్ ను తాము స్వీకరిస్తున్నామని తెలిపారు. శివసేనను మహారాష్ట్ర వెలుపల కూడా విస్తరిస్తామని చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/