కదిలింది పండరికి పల్లకి

SHIRDI SAI
SHIRDI SAI

కదిలింది పండరికి పల్లకి

సాయిబాబా తాను నివసించే పాడుబడ్డ మశీదును ద్వారకామాయి అంటారు. అది ఆయన దృష్టిలో ద్వారక, పండరీపురం, డాకోద్‌. ఆ మూడు పుణ్యక్షేత్రాలు శ్రీ కృష్ణుణకు సంబంధించినవే. అయితే ఆ మూడింటిలో పండరీపురం షిరిడీకి దగ్గర. ఇది దూరపు విషయంలోనే కాదు, అసలు షిరిడీ గ్రామమే నవీన పండరీపురమైంది అంటారు పాశ్చాత్యుడైన రిగోపోలస్‌. అలా షిరిడీని నవీన పండరీపురం చేయటంలో రాధాకృష్ణమాయి, నూల్కర్‌ మొదలైన వారి పాత్ర ఎంతో ఉన్నది.

పండరీపురం వాతావరణం షిరిడీలో ఉండేటట్లు చేసిన ఘనత వారిదే. పండరీపురంలో పాండురంగనకు ఆరతులు ఇచ్చే సాంప్రదాయం ఉన్నది. షిరిడీలో అటువంటి సాంప్రదాయమే లేదు. రాధాకృష్ణమాయి మామగారు పండరీపురంలో వకీలు. వారింటికి ఏడుతరాలుగా విఠలుని పల్లకి వచ్చేది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఆచారం ఆగిపోయింది. ఆమె ఎంతో కలవరపడ్డది దాని పునరుద్దరణకు. ఇక ఆమె షిరిడీకి వచ్చింది అదే ఆమె స్థిరనివాసమయింది కూడా. షిరిడీలో జరిగే పల్లకి ఉత్సవం, ఆరతులను షిరిడీలో ప్రవేశపెట్టింది ఆమె. సాయిబాబాకు నిత్యోత్సవంగా వాటిని పరిగణించుకోవచ్చును. సాయిబాబా పాండురంగడైనాడు. ‘షిరిడీ మాఝే పండరీపురం అని ఆడి పాడాడు దాసగణు. షిరిడీని పండరీపురంగా, సాయిబాబాను పాండురంగనిగా భావించే వారెందరో ఉన్నారు. పాండురంగ భక్తులు సంవత్సరానకి ఒక సారిగాని, రెండుసార్లు గాని ఒక నియమం ప్రకారం పండరీపురం చేరి, పాండురంగని దర్శిస్తారు.

ఆ సాంప్రదాయాన్ని షిరిడీ వాసులు కూడా పాటించేవారు. నియమానుసారం పండరీయాత్ర చేసేవారిని వార్కరీలు అంటారు. ఈ వార్కరీలు ఒక పల్లకిలో విగ్రహాలను, పూర్వపుభక్తుల పాదుకలను, పూజాసామాగ్రిని ఉంచి గుంపులు గుంపులుగా నామ సంకీర్తనం చేసుకుంటూ పండరీపురం చేరి పాండురంగని దర్శిస్తారు. ఆ యాత్రలో వారు జ్ఞానదేవ్‌, తుకారాం, నామదేవ్‌ల గాధలను వారు పాడుతూ వారీయాత్ర చేస్తారు. వీరు పండరీపురం చేరుకోగానే, నగరవాసులు వీరికి స్వాగతం పలుకు తారు. ఇటువంటి స్వాగతసత్కారాలు ప్రజలలో ఏకత్వ భావనను పెంపొందిస్తాయి. క్షణక్షణం ఆ మహాభక్తు లతో కలసి మెలసి తిరిగినట్లుండడం వలన సంకుచిత భావాలు రూపులేకుండా పోతాయి.

వర్ణ అహంకారం, హెచ్చు తగ్గులు ఉండవు. పరస్పర గౌరవ భావంతో వుంటారు. ఈ వార్కరీ సాంప్రదాయం జ్ఞానేశ్వర, నామదేవుల కాలం నాటి నుండి వున్నది. కొన్ని వందల సంవత్సరాల పాటు మహారాష్ట్రను భక్తి ప్రవాహంలో పరవశింపచేసింది. ఇన్నివేల మందితో, ఇన్ని దినాల పాటుసాగే, ఇన్ని సంవత్స రాలుగా సాగే భక్తివాహిని మరెక్కడా ఉండదనుకోవటం పొరపాటుకాదు.

ఈ సంవత్సరం జూలై 23న ఏకాదశి. ఆదినం నాడే అన్ని వార్కరీ పల్లకీ యాత్రికులు పండరినాధుని దర్శిస్తారు. దగ్గరున్న ఒకటో రెండు ప్రదేశాలకు తప్ప షిరిడీదాటని సాయినాధుడు సైతం ‘నేను పండరిపోవలెను. నేనక్కడ నివసించ వలెను. అది నాదైవం యొక్క భవనం అనటం అందరూ పండరీయాత్రను సాగిస్తారు. జయ పాండురంగ – జయ జయ పాండురంగ.

– యం.పి.సాయినాధ్‌