ప్రారంభానికి సిద్దమైన గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం భారీగా ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతుంది. ఇప్పటికే ఎన్ని ఫ్లైఓవర్లు అందుబాటులోకి రాగా..తాజాగా మరో అతి పెద్ద ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. రహేజా మైండ్‌స్పేస్‌ నుంచి గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ వరకు నాలుగులైన్ల శిల్పా లేఅవుట్‌ ఫ్లైఓవర్‌ ను అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ) ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. దీనిని ఆగస్టులో ప్రారంభించేందుకు అధికారులు సన్నహకాలు చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి, మైండ్‌స్పేస్ జంక్షన్, హైటెక్ సిటీలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది.

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌ మీనాక్షి, ఐకియాలను కలుపుతూ రూ.313.52 కోట్లతో ఔటర్‌రింగ్‌ రోడ్డు వైపు 4 లైన్లు, 823 మీటర్ల పొడవు, 16.60 మీటర్ల వెడల్పుతోనూ.. కొండాపూర్ వైపు 6 లైన్లు, 816 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతోనూ నిర్మిస్తున్న ఈ బైడైరెక్షనల్ ఫ్లైఓవర్ కు 2019 నవంబరు 4న తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశాడు. 2019 డిసెంబరులో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించబడ్డాయి.

హైదరాబాద్ మహానగర పాటక సంస్థ చేత ఇంజనీరింగ్ ఫీట్ అని పిలువబడుతున్న ఈ ఫ్లైఓవర్, భూమి నుండి 18 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయబడుతోంది. దీని నిర్మాణంలో భాగంగా అత్యంత పొడవైన స్పాన్‌ను గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీదుగా 64 మీటర్ల మేర బిగించబడింది. ఫేజ్‌-1లోని వై ఆకారంలో నిర్మించబడుతున్న ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళి ఔటర్‌రింగ్‌ రోడ్డుకు ఇరువైపులా తాకుతుంది. ఈ ఫ్లైఓవర్‌ నుంచి గచ్చిబౌలి వంతెన కన్నా ముందే వాహనాలు కిందకు దిగేందుకు వీలుగా ఓ ర్యాంపు ఉంటుంది. మరోటి నేరుగా బాహ్యవలయ రహదారిని కలుపుతుంది.