జూన్ 5 నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ: మంత్రి తలసాని

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల 5వ తేదీ నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి తలసాని నల్లగొండ జిల్లాలో ప్రారంభించనున్నారు. గొర్రెల పంపిణీ రెండో విడుత కార్యక్రమంపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గొర్రెల పంపిణీ చేపట్టాలని సూచించారు. జూన్ 5వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులను తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.