సోము చీప్ లిక్కర్ : కేటీఆర్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన షర్మిల..

బిజెపి సభలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పెద్ద ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.బీజేపీకి అధికారం ఇస్తే నాణ్యమైన ఆల్కహాల్ (లిక్కర్) క్వార్టర్ సీసాను రూ.50కే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పడం..ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. సోము ఫై ఓ రేంజ్ లో సెటైర్లు , విమర్శలు కురిపిస్తున్నారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సైతం తనదైన స్టయిల్ లో కామెంట్స్ చేసారు.

వాహ్‌.. ఎంత గొప్ప‌ పథకం.. ఎంత సిగ్గుమాలిన హామీ.. బీజేపీ ఏపీ నైతిక‌త విష‌యంలో మ‌రింత దిగ‌జారింది. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనేదే బీజేపీ జాతీయ విధాన‌మా? లేదంటే నిరాశ అధికంగా ఉన్న‌ రాష్ట్రాలకు మాత్రమే బీజేపీ ఈ బంపర్ ఆఫర్ ఇస్తుందా?’ అని ఎద్దేవా చేశారు కేటీఆర్. కేటీఆర్ ట్వీట్ కు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కౌంటర్ వేసింది.

తెలంగాణలో మద్యం ఏరులైపారిస్తోన్న టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కూడా మద్యం విక్రయాలపై నీతులు చెబుతున్నారంటూ పరోక్షంగా ధ్వజమెత్తారు. బీజేపీది చీప్ లిక్కర్ అయితే టీఆర్ఎస్‌ది కాస్ట్‌లీ లిక్కర్ అని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా.. ఏ సమయంలోనైనా మద్యం విక్రయిస్తున్న పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు.

మద్యం పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని.. ముఖ్యంగా యువతను మద్యానికి బానిసలను చేస్తున్నారని షర్మిల ధ్వజమెత్తారు. మహిళ రక్షణను కూడా గాలికొదిలేసి బడుల పక్కన, గ్రామగ్రామాన మద్యం విక్రయాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. విచ్చలవిడి మద్యం, నాయకులు ప్రజల రక్తం తాగుతున్నారని షర్మిల ఘాటుగా ట్వీట్ చేశారు.