పేదోడి ఇంట్లో బల్బ్ వెలగాలంటే జేబుకు చిల్లు పడాల్సిందే – ష‌ర్మిల‌

తెలంగాణ లో పెరిగిన కరెంట్ చార్జీల ఫై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర‌ విమర్శలు గుప్పించారు. పార్టీ ప్రకటన నుండి తెలంగాణ సర్కార్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్న షర్మిల..తాజాగా కరెంట్ చార్జీల ఫై ట్విట్టర్ ద్వారా స్పందించింది.

”కరెంట్ బిల్లులు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. పేదోడి ఇంట్లో బల్బ్ వెలగాలంటే జేబుకు చిల్లు పడాల్సిందే. మొన్నటి వరకు 80 యూనిట్ల లోపు వాడుకొంటే రూ.188 వచ్చిన బిల్లు ఇప్పుడు రూ.307కు చేరింది. ఇక పెరిగిన ఛార్జీలన్నీ 50, 100, 200 యూనిట్ల లోపు వాడుకొనే పేద, మధ్య తరగతి వాళ్లకే భారం. వైఎస్సార్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా బస్ ఛార్జీలు కానీ కరెంట్ ఛార్జీలు కానీ ఇంటి పన్ను కానీ ఒక్క పైసా పెంచలేదు. కేసీఆర్ గారు మాత్రం పన్నులు పెంచడమే పనిగా పెట్టుకొని పేదోని నడ్డి విరుస్తున్నాడు. పన్నులు, ఛార్జీలు తోచినంత పెంచి జనాల ముక్కు పిండి బిల్లులు వసూల్ చేస్తున్నాడు” అని ష‌ర్మిల పేర్కొన్నారు.

విద్యుత్‌ పంపిణీ సంస్థలు నష్టాల పేరుతో.. వినియోగదారుల జేబులకు చిల్లులు పెట్టడం మొదలుపెట్టారు. డిస్కంలను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు విద్యుత్‌ శాఖ తీసుకున్న నిర్ణయాలు వినియోగదారుల పాలిట గుదిబండగా మారుతున్నాయి. ఒక వైపు చార్జీల పెంపుతో పాటు అదనపు లోడుతో మరింత బాదుడుకు డిస్కంలు దిగడంతో.. చార్జీల మోతను తట్టుకోలేక సామాన్య ప్రజలు గిలగిలా కొట్టుకుంటున్నారు. పెరిగిన చార్జీలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.