షర్మిల పాదయాత్రకు అందరి ఆశీస్సులు కోరిన విజయమ్మ

తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్‌ తెలంగాణ పేరుతో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల..తండ్రి , అన్న బాటలో తన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టింది. తన తండ్రి , అన్న ఎలాగైతే పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టాలు తెలుసుకున్నారో..షర్మిల కూడా అదే బాట పడుతుంది. రేపు చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను చేపడుతుంది. ఈ సందర్భాంగా తల్లి విజయమ్మ ఓ వీడియో ను పోస్ట్ చేసింది.

తన బిడ్డ షర్మిల ఈ నెల 20న చేవెళ్ల నుంచి మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో తొలి అడుగు వేస్తోందని వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డిని అభిమానించే ప్రతి ఒక్కరూ షర్మిలను ఆదరించాలని కోరారు. పాదయాత్ర సందర్భంగా ఆమె అడుగులో అడుగు వేయాలని, చేతిలో చేయి కలపాలని, రాజన్న సంక్షేమ రాజ్యాన్ని సాధించుకోవాలని విజయమ్మ పిలుపునిచ్చారు.

షర్మిల ఇవ్వాళ ఇడుపులపాయకు రానున్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళి అర్పించనున్నారు. షర్మిల వెంట తల్లి వైఎస్ విజయమ్మ ఉంటారు. సాయంత్రం వరకూ ఇడుపులపాయలో గడుపుతారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు. ఇక షర్మిల పాదయాత్ర విషయానికి వస్తే..400 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగేలా షెడ్యూల్‌ను రూపొందించారు. 90 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా వైఎస్ షర్మిల పాదయాత్ర 4,000 కిలోమీటర్ల మేర సాగుతుంది. ప్రతిరోజూ ఉదయం 8:30 గంటలకు ఆమె తన పాదయాత్రను మొదలుపెడతారు. మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగిస్తారు. మధ్యాహ్నం భోజనం కోసం విరామం తీసుకుంటారు. మళ్లీ 3 గంటలకు పాదయాత్రను మొదలు పెట్టి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగిస్తారు. పాదయాత్ర ముగిసిన అనంతరం పార్టీ నేతలతో సమావేశమౌతారు. ఆ రోజు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, వినతుల గురించి చర్చిస్తారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలతో ఒక నోట్‌ను తయారు చేస్తారు.

ఈరోజు షర్మిల చేపట్టే నిరుద్యోగ నిరాహార దీక్షకు బ్రేక్ పడింది. పాదయాత్రను ప్రారంభించడానికి తన తండ్రికి నివాళిని అర్పించాల్సి ఉన్న నేపథ్యంలో- వైఎస్ షర్మిల ఇడుపులపాయకు వెళ్లాల్సి ఉన్నందున నిరుద్యోగ నిరాహార దీక్షను వాయిదా వేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు.