షర్మిల పాదయాత్ర షెడ్యూల్ విడుదల

YS Sharmila

తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా.. రాజన్న రాజ్యం తేవాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల.. పాద‌యాత్రకు సిద్ధమైంది. అక్టోబర్ 20 న చేవెళ్ల నుంచి తన పాదయాత్ర ప్రారభించబోతున్నట్లు తెలిపారు. మొత్తం 90 నియోజకవర్గాల్లో తన పాదయాత్ర ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏడాది పాటు తన పాదయాత్ర ఉంటుందని.. యాత్రలో అస్సలు బ్రేక్ లు ఉండవని.. చేవెళ్ళలో ప్రారంభమై చేవెళ్ళలోనే ముగింపు ఉంటుందని స్పష్టం చేశారు.

జిహెచ్ఎంసి మినహా అన్ని జిల్లాలు తాకేలా దాదాపు 90 నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉంటుందని.. వైఎస్ఆర్ సంక్షేమపాలన తేవడమే తన లక్ష్యం అన్నారు. పాదయాత్రలోను నిరుద్యోగ వారం లో భాగంగా మంగళవారం దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఏడేళ్ళల్లో కేసీఆర్ ప్రతి వర్గాన్ని మోసం చేశారని, కేసీఆర్ సీఎం ఆయిన తర్వాత దళితులపై దాడులు 800శాతం పెరిగాయని అన్నారు షర్మిల. మహిళలపై 300 శాతం దాడులు పెరిగాయని, బంగారు తెలంగాణ బారుల, బీరుల తెలంగాణ అయ్యిందని విమర్శించారు. కొత్త కొలువులు ఉండవని, ఉన్న వాటికి భరోసా లేదని అన్నారు షర్మిల. గత ఏడేళ్ళల్లో ఏడు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.

రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, సుమారు ఏడాదిపాటు పాదయాత్ర ఉంటుందని, రోజుకి 12 నుంచి 15కి.మీ పాదయాత్ర ఉంటుందని ఆమె చెప్పారు. కేసీఆర్‌కు భాజపా, కాంగ్రెస్ ఎలా అమ్ముడుపోయాయో పాదయాత్రలో చెబుతానన్నారు.