తెరాస సర్కార్ వరిధాన్యం కొనుగోలు చేయాలంటూ షర్మిల 72 గంటల దీక్ష

వరి కొనుగోలు విషయంలో తెరాస , బిజెపి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది. నువ్వు కొనాలంటే..నువ్వు కొనాలంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇరు పార్టీలు ధర్నాలు చేసి వార్తల్లో నిలిచారు. ఈ రెండు పార్టీలే కాదు ఇప్పుడు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైయస్ షర్మిల సైతం రంగంలోకి దిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల 72 గంటల దీక్ష మొదలుపెట్టింది.

ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతు వేదన నిరాహారదీక్షకు కూర్చున్నారు. మిగతా 48 గంటలు లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో దీక్ష చేయనున్నారు. రైతులకు అండగా ఉండేందుకు షర్మిల ఈ దీక్ష చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటె రైతులు మాత్రం వరి కొనుగోలు ఫై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంట కోతకు వచ్చింది. కొన్ని చోట్ల కోతలు కూడా అయిపోయాయి. ఈ క్రమంలో వరి కొనుగోలు చేస్తారో లేదో అని భయపడుతున్నారు.