భారీ వర్షానికి ములుగు అడవుల్లో చిక్కుకుపోయిన షర్మిల

మరోసారి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు, నాలుగు రోజులుగా కాస్త శాంతించిన వరుణుడు.. ఈరోజు ఉదయం నుంచి మళ్లీ తన ప్రతాపాన్ని మొదలుపెట్టాడు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు మళ్లీ ఉప్పొంగుతున్నాయి. రహదారులన్నీ మినీ చెరువులుగా దర్శనమిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. ఈ క్రమంలో వైస్ షర్మిల ములుగు అడవుల్లో చిక్కుకుంది.

శుక్రవారం (జులై 22) సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ములుగు జిల్లాలో పసర – తాడ్వాయి మధ్య పెద్ద వాగు ప్రధాన రహదారిపై పొంగుతోంది. అప్పుడే అటుగా షర్మిల కాన్వాయ్ వచ్చింది. ఆ ప్రవాహాన్ని దాటలేక అక్కడే నిలిచిపోయారు. ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరద కారణంగా వైఎస్ షర్మిల వాహన శ్రేణి సుమారు గంట సేపు అడవిలోనే నిలిచిపోయింది. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టేలా లేకపోవడంతో.. కాన్వాయ్‌ని వెనక్కి మళ్లించి, తిరిగి పసర వెళ్లిపోయారు.

ఇదిలా ఉంటె సూర్యాపేట జిల్లాలో కూలి పనుల కోసం వెళ్లిన 23 మంది కూలీలు చిక్కుకున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందపురం-జి.కొత్తపల్లి మధ్యలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న పాలేరు వాగులో 23 మంది వ్యవసాయ కూలీలు చిక్కుకున్నారు. ఒడ్డుకు చేరుకోలేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వీరు తీసుకున్న స్వీయ వీడియో వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరోసారి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సీఎస్​ సోమేశ్​కుమార్​, నీటి పారుదలశాఖ అధికారులు, ఈఎన్సీలతో సమావేశమయ్యారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వ, వరద ప్రాంతాలు, ఇతర అంశాలపై సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు.