కులవృత్తుల వారికి రూ.లక్ష సాయం..ఎన్నికల వేళ దొరకు బీసీలు గుర్తొచ్చారా?: షర్మిల

ఇప్పటికే దళితులను, గిరిజనులను దగా చేశాడని విమర్శలు

YSRTP Chief YS Sharmila

హైదరాబాద్‌ః తెలంగాణలో కుల వృత్తులు చేసుకునేవారికి రూ.1 లక్ష సాయం అందిస్తామంటూ నిన్న తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించడం తెలిసిందే. దీనిపై వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో స్పందించారు. ఎన్నికల వేళ కెసిఆర్ దొరకు బీసీలు గుర్తొచ్చారని విమర్శించారు. లక్ష సాయం అంటూ ఓట్ల కోసం ‘నయా’ వంచనకు తెరలేపాడంటూ ఆరోపించారు. ఇప్పటికే దళితబంధు పేరుతో దళితులను దగా చేశాడని, గిరిజన బంధు అంటూ ఊరించి గిరిజనులను ఉసూరుమనిపించాడని మండిపడ్డారు. దొర ఇప్పుడు బీసీలను మోసం చేసేందుకు సిద్ధమయ్యాడని పేర్కొన్నారు.

“తొమ్మిదేళ్లుగా బీసీలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించాడు. బీసీలకు రూ.55 వేల కోట్ల బడ్జెట్ అని చెప్పడమే కానీ, ఇప్పటిదాకా ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. స్వయం ఉపాధి రుణాల కోసం 6 లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తుంటే ఒక్కరికైనా లోన్ ఇచ్చారా? బీసీ బిడ్డలకు రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ కు దిక్కులేదు. ఎంబీసీ కార్పొరేషన్ కు రూ.3 వేల కోట్లు కేటాయిస్తే రూ.3 కోట్లయినా ఖర్చు చేశారా?

ఐదేళ్ల కిందట హామీ ఇచ్చిన బీసీ సబ్ ప్లాన్ ను అటకెక్కించారు. 50 శాతం రిజర్వేషన్లు పెంచాలనే ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చనే లేదు. బీసీల ఆత్మగౌరవ భవనాలు పునాదులే దాటలేదు. అసలు, మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యత ఉందా? బీసీల కులగణన అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి తెరవెనుక కేంద్రంతో లాలూచీ పడ్డాడు. బీసీ బిడ్డలు బర్రెలు, గొర్రెలు కాసుకోవాలి, చేపలు పట్టుకోవాలి…. కెసిఆర్ కుటుంబ సభ్యులు మాత్రం రాజ్యాలు ఏలాలి. ఇన్నాళ్లు బీసీలంటే చిన్నచూపు చూసిన దొరకు 60 లక్షల బీసీ కుటుంబాలు బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉన్నాయి” అంటూ షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు.