చైనాలో పెరుగుతున్నకరోనా కేసులు ..ఒక్కరోజే 11 మంది మృతి

మరింత కఠినంగా లాక్ డౌన్ ఆంక్షల అమలుకు నిర్ణయం

షాంఘై : చైనాలోని షాంఘై నగరంలో కరోనా ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాలేదు. లాక్ డౌన్ తో కఠినంగా వ్యవహరిస్తున్నా కేసులు పెరుగుతూనే ఉండడం అక్కడి అధికారులను అయోమయానికి గురి చేస్తోంది. సామాజిక వ్యాప్తి దశకు వెళ్లకుండా మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. గురువారం ఒక్క రోజే షాంఘైలో కరోనాతో 11 మంది మరణించారు. ఒక్క రోజులో ఇన్ని మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి.

కరోనా కేసుల సంఖ్య పీక్ కు చేరిందని, కొంత ఆంక్షలను సడలిద్దామనుకుంటున్న తరుణంలో.. కేసులు, మరణాలు పెరుగుతుండడం అధికార యంత్రాంగాన్ని పునరాలోచనలో పడేస్తోంది. సామాజిక వ్యాప్తి లేకుండా తొమ్మిది రకాల చర్యలు తీసుకోనున్నట్టు అక్కడి మున్సిపల్ పాలక మండలి ప్రకటించింది. ఎన్నో వారాల నుంచి షాంఘై నగరం లాక్ డౌన్ లో ఉండడం గమనార్హం.

ప్రజలు ఇళ్ల నుంచి అస్సలు బయటకు రాకూడదన్న నిబంధనను కట్టుదిట్టంగా అమలు చేయనుంది. ఇటీవల ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి వ్యాయామాలు చేయడం, నడవడం వంటి దృశ్యాల నేపథ్యంలో ఇకమీదట అసలు బయటకు రాకుండా చూడాలని మున్సిపల్ పాలనా మండలి నిర్ణయించింది. కరోనా ఇప్పటికీ తీవ్రంగానే ఉందని, నివారణ, నియంత్రణ కీలకమని పేర్కొంది. చైనాలో ఇప్పటికి 62 శాతం మందికే టీకాలు ఇచ్చారు. గురువారం ఒక్క రోజు దేశవ్యాప్తంగా 17,629 కేసులు వెలుగు చూశాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/