అన్ని సంస్థ‌ల‌కూ ఒకే ర‌క‌మైన నిబంధ‌న‌లు ఉండాలి..సీరం

ఫైజర్‌, మోడెర్నా సంస్థలకు ఆ భద్ర‌త క‌ల్పిస్తే మాకూ క‌ల్పించాలి.. సీరం సంస్థ‌

న్యూఢిల్లీ: దేశీయ సంస్థ సీరమ్‌ ఇనిస్టిట్యూట్ కేంద్ర ప్రభుత్వం నుండి ఇండెమ్నిటీ రక్షణ కోరుతుంది. భార‌త్‌కు త‌మ‌ వ్యాక్సిన్లను అందించాలంటే ఆర్థిక, చ‌ట్ట‌ ప‌ర‌మైన భద్ర‌త క‌ల్పిస్తామ‌ని హామీ ఇవ్వాల‌ని అమెరికాకు చెందిన ఫైజర్‌, మోడెర్నా సంస్థలు ఇప్ప‌టికే భార‌త్‌ను కోరాయి. అయితే ఇప్పుడు త‌మ‌కు కూడా ఆర్థిక, చ‌ట్ట‌ ప‌ర‌మైన భద్ర‌త కల్పించాల‌ని సీరమ్‌ ఇనిస్టిట్యూట్ డిమాండ్ ను లేవ‌నెత్తింది.  అన్ని సంస్థ‌ల‌కూ ఒకే ర‌క‌మైన నిబంధ‌న‌లు ఉండాల‌ని సీరం అంటోంది.

ఒక‌వేళ విదేశీ సంస్థ‌ల‌కు ఆర్థిక, చ‌ట్ట‌ ప‌ర‌మైన భద్ర‌త క‌ల్పిస్తే సీరం సంస్థ‌తో పాటు ఇత‌ర అన్ని వ్యాక్సిన్ సంస్థ‌ల‌కూ ఆ భ‌ద్ర‌త క‌ల్పించాలి అని సీరం వ‌ర్గాలు డిమాండ్ చేశాయి. వ్యాక్సిన్ల వల్ల భార‌త్‌లో ప్రతికూల ప్రభావాలు త‌లెత్తితే చ‌ట్ట‌ప‌ర‌మైన‌ చిక్కులతో పాటు ఆర్థికంగా నష్ట పరిహారాల అంశాలకు టీకా సంస్థలను బాధ్యులను చేయబోమంటూ స‌ర్కారు భ‌ద్ర‌త క‌ల్పించాల్సి ఉంటుంది.

దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఆ భద్ర‌త క‌ల్పించేందుకు తాము సిద్ధ‌మేనంటూ కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి. ఫైజర్‌, మోడెర్నాల సంస్థ‌లు దేశంలో త‌మ వ్యాక్సిన్ల‌ అత్యవసర వినియోగ అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకుంటే ఆ సంస్థలకు అనుమతి ఇస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెప్పాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/