మారని భర్తతో విడిపోతే తప్పులేదు!

నేను ఒకతన్ని ప్రేమించాను_అతన్నే పెళ్లాడాను…
ఇప్పుడు అంతా తారుమారైంది.

Women Sarrow

నేను ఒకతన్ని ప్రేమించాను. కులం సంకెళ్లు తెంచుకున్నాను. అతన్నే పెళ్లాడాను. వారంతాల్లో విహంగాల్లా తిరిగాము. మా జీవితాలను ఆదర్శంగా చాటాలనుకున్నాము. ఇప్పుడు అంతా తారుమారైంది. పెళ్లయిన ఆరుమాసాలకే ప్రేమ మబ్బులు వీడాయి. మనస్పర్థలు మొదలయ్యాయి. అతని వ్యసనాలు శాపమయ్యాయి. ఉద్యోగం పోగొట్టుకున్నారు. పరాన్నజీవిలా నా జీతంపై ఆధారపడ్డారు.అతని వ్యసనాలకు అప్పటి వరకు కూడబెట్టింది కూడ హారతయ్యింది.ప్రేమ శాపమయ్యింది.

పెళ్లి పంజరంలా మారింది. విషంకక్కే భర్త పడగనీడలో కాపురం చేయాల్సి వచ్చింది.ఆరుసంవత్సరాలు నరకయాతన అనుభవించాను. డిప్రెషన్‌కు గురయ్యాను. ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నాను.ఆఖరికి అమ్మ ఒడిలోకి చేరాను. మారని భర్తతో కలసి బ్రతకలేను.

అలా అని అతన్ని విడిచిపెట్టి ప్రేమకు కళంకం తేలేను. పతివ్రతలా మారి భర్తను మార్చుకుని జీవితం సాగించమని స్నేహితులు కొందరు సూచిస్తున్నారు. ప్రేమ, పాతివ్రత్యం పేరుతో జీవితాన్ని నరకప్రాయం చేసుకోవద్దని, విడాకులు ఇచ్చేసి కొత్త జీవితం ప్రారంభించమని మరికొందరు ఉపదేశిస్తున్నారు. అమ్మ, నాన్న చెల్లి కూడా విడాకులు ఇవ్వడమే మంచిదంటున్నారు.

అయితే నా మనస్సు విడిపోవడానికి అంగీకరించడం లేదు. పోనీ కలిసి ఉందామంటే భయమేస్తున్నద. నా మానసిక సంఘర్షణ తొలగించి సరైన మార్గదర్శనం చేసే వారి కోసం వెదుకుతున్నాను.మాదిమధ్య తరగతి కుటుంబం. అమ్మ, నాన్న వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. నన్ను, చెల్లిని బాగా చదివించారు.ఇద్దరం బిటెక్‌ చదివాము. నేను చదువైపోయిన తరువాత చెన్నైలోని ఒక బహుళ జాతీయ కంపెనీలో ఉద్యోగం సంపాదించాను. అక్కడే ఉద్యోగం చేస్తున్న ఒకతనితో పరిచయం జరిగింది.

అతనిది పశ్చిమగోదావరి జిల్లా కావడంతో అలవాట్లు, అభిరుచులు కలిశాయి. దీంతో సాన్నిహిత్యం పెరిగి మనసులు దగ్గరయ్యాయి. అది ప్రేమగా పరిణమించింది. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాము. మాకులాలు వేరుకావడంతో ఇరువైపులా పెద్దలు సమ్మతించలేదు.

మా రెండు కులాల మధ్య రాష్ట్రవ్యాప్తంగా వైరి భావం ఉంది. ఒకరు చదివే పేపరు మరొకరు చదవనంత దూరంఉంది. అయినా పట్టు బట్టి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాము. చెన్నైలో కాపురం పెట్టిన కొద్ది రోజులకే అతనికి తాగుడు అలవాటు ఉందని తెలిసింది. అడిగితే ఏదో స్నేహితుల బలవంతం మీద అప్పుడప్పుడు తాగుతున్నానని చెప్పారు.

ఇక నుంచి తాగనని ఒట్టు వేశారు. ఆరువాసాలు గడిచేటప్పటికి అతను తాగి అల్లరి చేయడంవల్ల ఉద్యోగం పోగొట్టుకున్నారు. తరువాత తిరగడం ప్రారంభించారు. రాను, రాను ఒళ్లు తెలియకుండా తాగి ఇంటికి రావడం ప్రారంభించారు. అలాంటి దశలోమాట్లాడితే వాదనలు పెరిగి గొడవలు చోటు చేసుకునేవి. ఒక్కోసారి నన్ను, నా కుటుంబాన్ని,కులాన్ని తూలనాడి నన్ను కొట్టేవారు అయినా సహించి రెండుసార్లు డి-అడిక్షన్‌ కేంద్రంలో చేరించి చికిత్స చేయించాను. అయినా మార్పు రాలేదు.

ఈ నేపథ్యంలో నాలో ఒత్తిడి పెరిగి థైరాయిడ్‌, డిప్రెషన్‌కు గురయ్యాను. దీంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలో పొరపాట్లు జరిగి ఉద్యోగం పోగొట్టుకున్నాను. కూడబెట్టుకున్న డబ్బు, నగలు కూడా ఆయన వ్యసనాలకు హారతయ్యాయి. దీంతో విధిలేక అమ్మా,నాన్నల వద్దకు వచ్చేశాను. అతను కూడా వరింటికి వెళ్లారు. అతనిలో ఎలాంటి మార్పురాలేదు. నా వయసు ఇప్పుడు 30 యేళ్లు. ఈ దశలో నా సమస్యలకు తగిన పరిష్కారంచెప్పగలరు. – సుష్మిత

అమ్మా! మీ సమస్య చాలా సున్నితమైనది.విడాకులు తీసుకోమంటే సంప్రదాయ వాదులు దండెత్తుతారు. కలసి ఉండమంటే అభ్యుదయ వాదులు విమర్శిస్తారు. మన వివాహ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం. పాతివ్రత్య ధర్మాలు మన మహిళలకు ఔన్నత్యం చేకూరుస్తున్నాయి.

అయితే ఆచారం, వ్యవహారం, ధర్మాల పేరుతో వ్యసనపరులు సమస్యాత్మకమైన భర్తలను భరించాల్సిన అవసరం లేదు. మనశరీరంలో ఒక్కోసారి దెబ్బతిన్న అవయవాలను ఆపరేషన్‌ చేసి తొలగించుకుంటాము.వ్యవస్థకు ద్రోహం చేసే అరాచకాలు, అసాంఘిక శక్తులను చట్టాలు శిక్షిస్తాయి. మన సమాజాన్ని విలువలు, ధర్మాలతో పాటు చట్టాలు పరిరక్షిస్తున్నాయి. సమాజంలో కీలక భూమిక పోషించే మహిళల సంరక్షణ, సంక్షేమం కోసం పలు సంస్కరణలు, చట్టాలు వచ్చాయి.

మహిళల్ని పురుషు లతో సమానంగా చూడాల్సిన అవసరాన్ని అందరు గుర్తిం చారు. మహిళలు వంటింటికే పరిమితం కారాదని విద్యావకాశాలు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి వర్గానికి చెందిన మహిళలకు రిజర్వేషన్లు పెట్టారు. అంటే మహిళలకు అన్ని విధాలా సమాన అవకాశాలు, హక్కులు కల్పించే దిశలో పయనిస్తున్నాము. ఒకప్పుడు సతీసహగమనం పేరుతో చనిపోయిన భర్తతో పాటు భార్యను చితికి ఆహుతి చేసేవారు.

కాలక్రమంలో ఇలాంటి అమానుషాలు నశించిపోయాయి. సామాజికవేత్తలు, సంఘసంస్కర్తల కృషి వల్ల విధవా వివాహాలు వచ్చాయి. అలాగే పరిణామక్రమంలో ఒక స్త్రీ విడాకులు పొంది కొత్తజీవితం ప్రారంభించడానికి వీలుగా చట్టాలు వచ్చాయి. స్త్రీల రక్షణ కోసం గృహహింస చట్టాలను రూపొందించారు. ఇన్ని మార్పులు వచ్చిన నేపథ్యంలో ప్రేమ, పాతివ్రత్యం అన్న సెంటిమెంట్లతో వ్యసనపరుడు, నిరర్షకుడైన భర్తతో కలసి ఉండాల్సిన అవసరం లేదు.

అతన్ని బాగు చేయడానికి మీ వంతు కృషి చేశారు. ఇప్పటికీ అతని కోసం మీ మనసు పరితపిస్తున్నదంటే మీది మంచి ప్రేమ అనడంలో సందేహం లేదు. అయితే ఎంతకూ మారని అతనితో కలసి ఉండాల్సిన అవసరం లేదు. పిల్లల విషయం ప్రస్తావించలేదు కాబట్టి మీకు పిల్లలు కూడా లేరని భావిస్తున్నాను.

మీ ప్రేమకోసం మరొకసారి అతన్ని మార్చడానికి ప్రయత్నించండి. ఫలితం లేకపోతే విడాకులు పొంది థైరాయిడ్‌, డిప్రెషన్‌కు చికిత్స పొంది కొత్త జీవితం ప్రారంభించడమే మంచిదని నా సలహా.

– డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/