నేడు ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు

ఉపరాష్ట్రపతి, గవర్నర్‌, ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖుల నివాళి 

Jaipal Reddy passes away
Jaipal Reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి (77) ఆదివారం తెల్లవారుజామున (సుమారు 1.28 గంటల సమయంలో) కన్నుమూశారు. నిమోనియాతో కొన్ని రోజుల కిందట గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ ఎంట్రాలిజీ ఆసుపత్రిలో ఆసుపత్రిలో చేరిన జైపాల్ రెడ్డి చికిత్స తీసుకుంటూనే తుదిశ్వాస విడిచారు. జైపాల్‌రెడ్డికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, ఓ కుమా ర్తె ఉన్నారు. ఆయన మరణంతో భారత పార్లమెంటరీ రాజకీయాల్లో అయిదు దశాబ్దాలుగా మారుమోగిన ఒక తెలుగు గళం మూగబోయినట్లయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మాడుగులలో 1942 జనవరి 16న జన్మించారు. 18 నెలల వయసులో ఉండగానే పోలియో కారణంగా వైకల్యానికి గురయ్యారు. కానీ, అది ఆయన రాజకీయ జీవన ఆరోహణకు ఎన్నడూ అవరోధం కాలేకపోయింది. పలుమార్లు కేంద్ర మంత్రిగా, ఐదు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, నాలుగు సార్లు ఎంఎల్‌ఎగా పని చేసి సుదీర్ఘ రాజకీయ అనుభవం గడించారు.

జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు సిఎస్ జోషికి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ లోని జైపాల్ రెడ్డి నివాసం నుంచి అంతిమయాత్ర నిర్వహించనున్నారు. జైపాల్ రెడ్డి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్ధం గాంధీభవన్‌లో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు నెక్లెస్ రోడ్డులోని పివి. నరసింహారావు ఘాట్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. అక్కడ ఆయన భౌతిక స్మారకార్దం స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/