సీనియర్‌ సిటిజన్లను గౌరవించడం సామాజిక బాధ్యత!

నేడు సీనియర్‌ సిటిజన్స్‌ డే

senior Citizens Day-
senior Citizens Day-

దేశాభివృద్ధికి యువత ఎంత ముఖ్యమో సీనియర్‌ సిటిజన్స్‌ కూడా అంతే ముఖ్యం. యువత బలం సీనియర్‌ సిటిజన్స్‌ అనుభవం కలిస్తేనే దేశం అభివృద్ధిపదంలో ముందుకు నడుస్తుంది.

కాలానుగుణంగా ఆయుర్ధాయం పెరిగి సీనియర్‌ సిటిజన్స్‌ సంఖ్య అన్ని దేశాల్లో పెరుగుతుంది.

1988వ సంవత్సరంలో అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగాన్‌ ఆగస్టు 19న 5847 ప్రకటనపై సంతకం చేసి ఆగస్టు 21ని సీనియర్‌ సిటిజన్స్‌ డేగా ప్రకటించారు.

14 డిసెంబరు 1990లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ఆగస్టు 21ని సీనియర్‌ సిటిజన్స్‌ డేగా ఆమోదించింది.

ఈ రోజు మనం దేశంలో ఉన్న సీనియర్‌ సిటి జన్స్‌ పరిస్థితిపై అవగాహన పెంచడం, వారికి మద్దతు ఇవ్వడం, సమాజంలో వారి భాగస్వామ్యాన్ని గుర్తించడం లాంటి పనులతో వారిని గౌరవించుకోవాలి.

పెద్దల దుర్వినియోగం గురించి ఉన్నత అవగాహన కల్పించడం అనే లక్ష్యంతో 2020 సీనియర్‌ సిటిజన్స్‌ డేని జరుపుకుంటున్నాం.

మన పాతతరం ప్రజలు కలిగిఉన్న జ్ఞానం, అనుభవాలు యువతరంతో పంచుకునే సమయమే ఈ రోజు. మధ్యయుగం ప్రారంభంలో ఆయుర్ధాయం ముప్ఫై సంవ త్సరాలు మాత్రమే ఉండేది. 1900 సంవత్సరం నాటికి 31 సంవత్సరాలకు పెరిగింది.

మొనాకోలో ప్రపంచంలోనే సుదీర్ఘ ఆయుర్దాయం 89.52గా ఉంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 60 సంవత్సరాలపైన ఉన్న వారు ప్రపంచవ్యాప్తంగా 2017 నాటికి 962 మిలియన్లు ఉన్నారు.

2050 నాటికి 2.1 బిలియన్స్‌కు చేరుకుంటారు.

ఆసియా, ఐరోపాలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం జపాన్‌లో 28శాతం, ఇటలీలో 28 శాతం అమెరికాలో 16 శాతం, చైనాలో 12 శాతం, భారత్‌లో ఆరు శాతం, నైజీరియాలో మూడు శాతంగా సీనియర్‌ సిటిజన్స్‌ ఉన్నారు.

senior Citizens Day-

ప్రపంచీకరణతో మానవ సంబంధాలు అంతరించడం వల్ల కని పెంచిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలోకి పంపుతున్న సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది.

దీనికి కారణం పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ, విద్యావిధానంలో లోపం, నైతిక విలువలు లేని కార్పొరేట్‌ విద్య, సీనియర్‌ సిటిజన్స్‌ ప్రధానంగా శారీరక, మానసిక, సామాజిక, భావోద్వేగ, ఆర్థిక, కుటుంబ, వయోభారం, ఒంటరితనం మొదలైన సమస్యలను ఎదుర్కొం టున్నారు.

సీనియర్‌ సిటిజన్స్‌ ఆరోగ్యసంరక్షణ, సంక్షేమం కోసం సామాజిక భద్రత, మద్దతు లభిస్తుందని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 41 పేర్కొంటుంది.

వృద్ధులపై జాతీయ విధానాన్ని జన వరి 1999లో ప్రకటించారు. ఇది దేశంలో వృద్ధుల శ్రేయస్సు కోసం ఆర్థిక భద్రత, ఆరోగ్యం, సంరక్షణ, ఆస్తి వంటి అనేక రంగాలని గుర్తించింది.

అదే విధంగా రాష్ట్రప్రభుత్వం సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్‌ స్కీమ్‌, ప్రధాన మంత్రి వయోవందన యోజన, రాష్ట్రీయ వయోశ్రీ యోజన వంటి పథకాలను అమలు చేస్తోంది.

ముఖ్యంగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా కొత్తూరు గ్రామంలో 2014 నవం బరు 8న తెలంగాణ ఆసరా పెన్షన్‌ పథకాన్ని ప్రారంభించారు.

65 సంవత్సరాలు దాటిన వారికి వెయ్యి రూపాయల పెన్షన్‌ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా అందిస్తోంది. 2019 ఏప్రిల్‌ 1 నుంచి 57 సంవత్సరాలపైబడిన వాళ్లకు వెయ్యి నుంచి 2016 రూపా యలకు ఆసరా పింఛన్‌ పెంచడం జరిగింది.

39.41 లక్షల మందికి ఆసరా పెన్షన్‌ కోసం తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది.

2004 జన వరి, సెప్టెంబర్‌ నుంచి కేంద్రప్రభుత్వం ఉద్యోగులు ఎవరైతే కొత్తగా సర్వీసులోకి వచ్చారో వారికి పాత పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి, నూతన పెన్షన్‌ విధానాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తేవడం జరిగింది.

2004 తర్వాత నియామకమైన వారు 2030-2040 మధ్యలో సీనియర్‌ సిటిజన్స్‌గా పదవీ విరమణ చేస్తారు. ప్రస్తు తం ఉన్న పాత పెన్షన్‌ కాకుండా నూతన పెన్షన్‌లో వారి పెన్షన్‌ను మార్కెట్‌ నిర్ణయిస్తుంది.

అంతర్జాతీయ మార్కెట్‌ ఒడిదుడుగులకు లోబడి నెలనెలా పెన్షన్‌ మారుతూ వృద్ధ్యాప్యంలో వారి ఆర్థిక భద్రత గాలిలో దీపంగా మారుతుంది.

సుమారు 30 సంవత్సరా లు ప్రభుత్వ సేవలో ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? మార్కెట్‌పై ఆధారపడ్డ నూతన పెన్షన్‌, వృద్ధ్యాప్యంలో వారికి ఎలా తోడ్పడుతుంది?

ఉద్యోగుల వాటా, ప్రభుత్వం వాటా మొత్తం స్టాక్‌ మార్కెట్‌లో పెడితే, వారి బతుకులు భద్రత లేని బతుకులు కావా? .

వ్యవస్థీకృత రంగంలో అందులో ప్రభుత్వంలో సేవలందించిన వారి వృద్ధ్యాప్యబతుకులను మార్కెట్‌ జూదానికి వదిలిపెట్టడం ప్రభుత్వానికి సమంజసమా? ప్రభుత్వాలు తెచ్చిన ఈ విధానం వల్ల సీనియర్‌ సిటిజన్స్‌ని ఎలా గౌరవించినట్లు అవుతుంది?

ఈ మధ్యనే పదవీ విరమణ చేసినవారి నూతన పెన్షన్‌ ఆసరా పెన్షన్‌ కన్నా అధ్వాన్నంగా ఉంది

.రాజకీయ నాయకులకు ఒక్కసారి ఐదు సంవత్సరాలు పదవిలో ఉంటేనే పెన్షన్‌ ఇస్తున్నప్పుడు 30 సంవత్సరాలు ప్రభుత్వ సేవలోఉన్న ఉద్యోగులకు వృద్ధ్యాప్యంలో ఇచ్చే గుర్తింపు ఇదేనా?

పెన్షన్‌ లెక్కలను లాభనష్టాలతో చూడటానికి ప్రభుత్వం ఏమైనా వ్యాపార సంస్థనా? పెన్షన్‌ అనేది ఉద్యోగి ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పేర్కొంది.

పెన్షన్‌కు దూరం చేయడం అంటే వ్యక్తి జీవించే హక్కును కాలరాయడమే.

సంవత్సరానికి ఒకసారి సీనియర్‌ సిటిజన్స్‌ గురించి మాట్లాడుకొని తర్వాత మర్చిపోవడం కాకుండా వారికి కావలిసిన సేవలు అటు ప్రభుత్వం, ఇటు సమాజం సమకూర్చడమే మనం వారికి ఇచ్చే నిజమైన గుర్తింపు.

-జుర్రు నారాయణ యాదవ్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/