రేపు బన్సిలాల్‌పేట్‌లో ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు ..

సికింద్రాబాద్‌ కంట్మోనెంట్‌ బిఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న (72) ఆదివారం కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆయన గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూశారు. రేపు మధ్యాహ్నం బన్సిలాల్‌పేట్‌లో సాయన్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. ఉదయం ఆయన పార్థివ దేహాన్ని ఆయన నివాసం నుంచి.. కార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉంచనున్నారు.

నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం మూడు గంటలపాటు పార్థివదేహాన్ని క్యాంపు కార్యాలయంలోనే ఉంచనున్నారు. ఆ తర్వాత బన్సిలాల్‌పేట శ్మశాన వాటికలో సాయన్న అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు వెల్లడించారు. 1951 మార్చి 5న సాయన్న చిక్కడపల్లిలో జన్మించారు. ఇప్పటి వరకు ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ఎమ్మెల్యే సాయన్న మృతికి మంత్రి కేటీఆర్‌, ఇతర బీఆర్​ఎస్​ నేతలు సంతాపం తెలిపారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సాయన్న మృతితో పలువురు ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు.